US-India: భారత్‌తో బంధం చాలా అవసరం.. ఇండో-పసిఫిక్‌ సుస్థిరతపై అమెరికా

US-India: భారత్‌, అమెరికా మధ్య వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ అక్కడి సెనెట్‌ కమిటీకి వివరించారు.

Published : 12 Apr 2024 08:32 IST

వాషింగ్టన్‌: భారత్‌తో బలమైన బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ (Lloyd Austin) మరోసారి నొక్కిచెప్పారు. ఇండో-పసిఫిక్‌ (Indo-Pacific) ప్రాంతంలో సుస్థిరతకు భారత్‌ చాలా అవసరమని ఉద్ఘాటించారు. అందుకనుగుణంగా ఇండియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించాలని సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీకి వివరించారు. ఈ మేరకు కావాల్సిన బడ్జెట్‌ ప్రతిపాదనలను వారి ముందుంచారు.

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం గురించి కమిటీకి ఆస్టిన్‌ (Lloyd Austin) తెలిపారు. హిందూ మహా సముద్రంలో భద్రత కోసం సంయుక్త సైనిక విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి సహా ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికా కలిసి చేస్తున్న ప్రయత్నాలకు దన్ను లభిస్తోందన్నారు.

స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ (Indo-Pacific) నిర్మాణానికి భారత్‌-అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా కీలకమని కమాండర్ అడ్మిరల్‌ జాన్ సి అక్విలినో సెనెట్‌ చట్టసభ్యులకు వివరించారు. ఈ మేరకు ఎయిర్‌ డొమైన్‌లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండోళ్లకోసారి జరిగే ఏరో ఇండియాలో అమెరికా బీ-1బీ బాంబర్‌ విమానాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు ‘కోప్‌ ఇండియా’లోనూ అగ్రరాజ్యం భాగస్వామ్యమవుతోందని అక్విలినో వివరించారు. టైగర్‌ ట్రయంఫ్‌ పేరిట భారీ విన్యాసాలనూ చేపట్టినట్లు గుర్తుచేశారు.

భారత షిప్‌యార్డుల్లో అమెరికా నౌకల మరమ్మతులు సహా హిందూ మహాసముద్రంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు అక్విలినో చెప్పారు. ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌’ కింద వీటిని చేపట్టనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని