WHO: కరోనాపై ‘ప్రజారోగ్య అత్యవసర స్థితి’ ఎత్తివేత

కరోనాపై ‘ప్రజారోగ్య అత్యవసర స్థితి’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఎత్తేసింది. మహమ్మారి క్రమంగా ప్రబలుతోన్న వేళ.. 2020 జనవరి 30న డబ్ల్యూహెచ్‌వో కమిటీ దీన్ని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్థితిని తొలగించింది.

Published : 05 May 2023 20:52 IST

జెనీవా: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ (COVID- 19) విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిపై ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర స్థితి (Global Health Emergency)’ ఎత్తేసింది. మూడేళ్ల క్రితం కొవిడ్‌ కేసులు ప్రబలడం మొదలైన తరుణంలో.. 2020 జనవరి 30న డబ్ల్యూహెచ్‌వో కమిటీ దీన్ని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ‘కొవిడ్ వైరస్‌ ఇప్పుడు గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ కానప్పటికీ.. ఇంకా వ్యాప్తిలోనే ఉందని గుర్తించాలి. ఈ వైరస్‌తో ఆరోగ్య ముప్పు తొలగిందని అర్థం కాదు’ అని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ప్రాబల్యం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్‌వో వివరాల ప్రకారం.. కరోనా కారణంగా మరణాల రేటు 2021 జనవరిలో అత్యధికంగా వారానికి లక్షకుపైగా ఉండగా గత నెల 24 నాటికి 3,500కి తగ్గింది. మున్ముందు దీన్ని అత్యవసర స్థితిగా కొనసాగించాలా? లేదా అనే విషయంపై ఏడాదిగా పలుమార్లు సమీక్ష జరిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. తాజాగా ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ వైరస్‌ బారినపడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మృతి చెందినట్లు తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య రెండు కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని