Corona Virus: కరోనా వైరస్‌తో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు!

కరోనా వైరస్‌ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వైరస్‌ వల్ల నాడీకణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుందని అధ్యయనం పేర్కొంది.

Published : 15 Nov 2022 20:26 IST

లండన్‌: కరోనా వైరస్‌ సోకిన వారిలో సాధారణంగా జ్వరం, రుచి కోల్పోవడం లాంటి  సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ మహమ్మారి నేరుగా నాడీ కణాలను ప్రభావితం చేయనప్పటికీ ..నాడీ వ్యవస్థకు హాని కలిగించే అవకాశముందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల ఏకాగ్రత కోల్పోవడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయని స్విట్జర్లాండ్‌కు చెందిన బాసెల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కరోనా వైరస్‌ నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై  పరిశోధన చేశారు.

కరోనా వైరస్‌ సోకిన వారి ప్లాస్మా, సెరెబ్రోస్పైనల్‌ ప్లూయిడ్‌ (మెదడులోని ఒక రకమైన స్రావం)లపై జార్జర్‌ హట్టర్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. ఈ స్రావాలపై కరోనా వైరస్‌ ప్రభావం చూపిస్తున్నట్లు తేల్చారు. దీనివల్ల మెదడుతోపాటు, శరీర అవయవాలకు రక్త ప్రసరణలో వ్యత్యాసాలు ఏర్పడి.. బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని వారు తేల్చారు. దీనికి సంబంధించి నేచర్‌ కమ్యూనికేషన్స్‌ అంతర్జాతీయ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది.

కొవిడ్‌ సోకిన వ్యక్తులపై 13 నెలలపాటు హట్టర్‌ బృందం పరిశోధనలు జరిపింది. కొందరికి మెదడుకు రక్తప్రసరణ వ్యవస్థలో అవాంతరాలు ఎదురైనట్లు గుర్తించారు. ప్రో ఇఫ్లమేటరీ స్రావాలు అధిక మొత్తంలో విడుదలైనందువల్లే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో మాత్రం ఈ ప్రభావం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్‌తో పోరాటం చేసేందుకు శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు వైరస్‌తోపాటు మానవ కణజాలం మీద కూడా దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే పలు సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనకు నాయకత్వం వహించిన జార్జర్‌ హట్టర్‌ తెలిపారు. అయితే ఈ సమస్యను ముందుగా గుర్తించేందుకు ఏం చేయాలన్నదానిపై పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని