Donald Trump: ప్రిన్స్ హ్యారీపై చర్యలు తీసుకొంటా: ట్రంప్‌

తాను మరోసారి అధికారంలోకి వస్తే బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీపై చర్యలు తీసుకొనేందుకు వెనుకాడనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. 

Updated : 20 Mar 2024 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను అధికారంలోకి వస్తే బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీపై అవసరమైతే తగిన చర్యలు తీసుకొంటానని రిపబ్లికన్‌ అభ్యర్థిత్వ రేసులో ఉన్న ట్రంప్‌ పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వీసా పొందే సమయంలో సదరు దరఖాస్తుదారుకి గతంలో మాదక ద్రవ్యాలు వినియోగించిన చరిత్ర ఉంటే వెల్లడించాలి. ఆ సమాచారం ఆధారంగానే వీసా ఇచ్చేది లేనిది నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే.. వారికి భారీగా జరిమానా విధించడం లేదా తిరిగి వెనక్కి పంపే అధికారం అమెరికాకు ఉంటుంది. 

 ప్రిన్స్‌ హ్యారీ 2020 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. అతడు స్పేర్‌ అనే పుస్తకం రాశాడు. గతంలో మాదక ద్రవ్యాలు వాడినట్లు దానిలో పేర్కొన్నాడు. ఈ అంశంపై హెరిటేజ్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ అతడి ఇమ్మిగ్రేషన్‌ రికార్డులు చూపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ప్రిన్స్‌ హ్యారీ వీసా దరఖాస్తును కోర్టులో ఇవ్వాలని పేర్కొన్నారు. తాజాగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది.  బ్రిటన్‌కు చెందిన జీబీ న్యూస్‌ అనే సంస్థ ఈ అంశాన్ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్ద ప్రస్తావిస్తూ.. ఒక వేళ మీరు ఎన్నికల్లో గెలిస్తే ప్రిన్స్‌కి ఏమైన ప్రత్యక రక్షణ లభిస్తుందా..?అని అడిగారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘అతడికి అసలు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉందో లేదో చూడాలి. అతడు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తగిన చర్యలు తీసుకొంటాం’’ అని పేర్కొన్నారు. కచ్చితంగా ఆ చర్యలు ఏమిటనేది మాత్రం వెల్లడించలేదు. అతడిని అమెరికా నుంచి వెనక్కి పంపించే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. 

మేఘన్‌ మార్కెల్‌ను 2018లో ప్రిన్స్‌ హ్యారీ పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత రాచరికపుహోదాను వదులుకొని  ఈ జంట అమెరికాకు వెళ్లిపోయింది. ఆ తర్వాత చాలా అరుదుగా మాత్రమే బ్రిటన్‌కు వెళ్లేవారు. వీరి పిల్లలను మాత్రం రాజకుటుంబ వారసులుగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని