Donald Trump: పాలస్తీనా మద్దతు ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను సాగనంపుతా: ట్రంప్‌

పాలస్తీనాకు మద్దతుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను స్వదేశాలకు సాగనంపుతానని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ పేర్కొన్నారు.  

Published : 28 May 2024 13:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలను చేపట్టిన విదేశీ విద్యార్థులను అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు పంపించేస్తానని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వెల్లడించారు. న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ కార్యక్రమంలో దాతలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారి ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటారని హెచ్చరించారు. 

‘‘నేను ఒక పని చేస్తాను.. ఏ విద్యార్థి అయినా దేశంలో ఆందోళనలు చేస్తే.. వారిని అమెరికా బయటకు సాగనంపుతాను. మీకు తెలుసు ఆ ఆందోళనల్లో చాలా మంది విదేశీ విద్యార్థులున్నారు. అతి త్వరలోనే వారు తమ ప్రవర్తనకు మూల్యం చెల్లించుకొంటున్నారని వింటారు’’ అని ట్రంప్‌ వెల్లడించారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు ఏదో ఒక రోజు అమెరికాలో రాజ్యాంగ పదవులు చేపట్టవచ్చని ఓ దాత ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ నిరసనలను అణచివేస్తానని పేర్కొన్నారు. గాజా యుద్ధం విషయంలో ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ దేశం పోరాడుతోందని మెచ్చుకొన్నారు. 

కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆందోళనలను అణచివేసిన పోలీస్‌ శాఖను ట్రంప్‌ అభినందించారు. వీటిని ఇప్పుడే  అడ్డుకోవాలన్నారు. తనను ఎన్నుకొంటే 25-30 ఏళ్ల నాటి పరిస్థితిని మళ్లీ తీసుకొస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఏప్రిల్‌లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి. తమ కళాశాలలు ఇజ్రాయెల్‌తో పనిచేసే కంపెనీలతో సంబంధాలను వదులుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో దాదాపు 2,000 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని