Sweeteners: కృత్రిమ తీపి పదార్థాలు బరువు తగ్గిస్తాయా..? WHO ఏమందంటే..!

బరువు నియంత్రణలో కృత్రిమ తీపి పదార్థాలతో దీర్ఘకాలంలో ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. పైగా వాటితో.. టైప్‌- 2 మధుమేహం, గుండె జబ్బుల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.

Published : 17 May 2023 01:35 IST

జెనీవా: కేలరీలు ఉండవని.. తద్వారా బరువు నియంత్రణ (Weight Control)కు సహాయపడతాయని భావిస్తూ కొంతమంది చక్కెర (Sugar)కు బదులుగా కృత్రిమ తీపి పదార్థాల (Non Sugar Sweeteners)ను వాడుతుంటారు. అయితే, బరువు నియంత్రణలో వాటితో ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో కృత్రిమ తీపి పదార్థాలను వినియోగించవద్దని తన తాజా సిఫార్సుల్లో (WHO Guidelines On NSS) పేర్కొంది.

ఆస్పర్టేమ్‌, నియోటేమ్, శాకరిన్, సుక్రలోజ్ వంటి వివిధ కృత్రిమ తీపి పదార్థాలను ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు, పానీయాల్లో ఉపయోగిస్తారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా వీటిని విడిగా కూడా విక్రయిస్తారు. అయితే, పెద్దలు, చిన్నారుల్లో బరువు నియంత్రణలో ఈ కృత్రిమ తీపి పదార్థాలు ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించవని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పైగా.. వాటి ఉపయోగం వల్ల టైప్-2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు, పెద్దల్లో మరణాల ముప్పు వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది.

‘ఎటువంటి పోషకాలు ఉండవు..’

‘సాధారణ తీపి పదార్థాలకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను వినియోగించడం.. దీర్ఘకాలంలో బరువు నియంత్రణలో సహాయపడదు. బదులుగా.. సహజమైన చక్కెరతో కూడిన పండ్లు, తీపి లేని ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం వంటి ఇతర మార్గాలను అనుసరించాలి’ అని డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బ్రాంకా సూచించారు. కృత్రిమ తీపి పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం కాదని, పైగా వాటిలో ఎటువంటి పోషకాలు ఉండవని తెలిపారు. ఆరోగ్యంగా ఉండేందుకుగానూ చిన్నప్పటినుంచే తక్కువ తీపి తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

అయితే, ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నవారికి మినహా మిగతావారికి ఈ సిఫార్సు వర్తిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ‘మందులు, స్కిన్‌ క్రీమ్స్‌ వంటి ఉత్పత్తుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ను ఉపయోగించవచ్చు. తక్కువ కేలరీలు ఉండే తీపి పదార్థాలు, షుగర్‌ ఆల్కహాళ్లకు కూడా ఈ సిఫార్సు వర్తించదు. ఇవన్నీ కేలరీలు ఉండే తీపి పదార్థాలు కాబట్టి.. కృత్రిమ తీపి పదార్థాల పరిధిలోకి రావు’ అని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అసాంక్రమిక వ్యాధుల ముప్పును నివారించడంతోపాటు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లలో భాగంగా తాజా సిఫార్సులు జారీ చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని