Israel Strikes: ఉద్రిక్తతల వేళ.. సెంట్రల్‌ గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు!

సెంట్రల్‌ గాజాలో అనేక చోట్ల ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఇందులో పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Published : 12 Apr 2024 21:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిరియా రాజధానిలో ఉన్న తమ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ప్రతీకార దాడులకు తెగబడవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. సెంట్రల్‌ గాజాలో అనేక చోట్ల శుక్రవారం దాడులు జరిపాయి. కాల్పలు విరమణపై చర్చలు ప్రారంభమవుతోన్న సమయంలోనే ఇజ్రాయెల్‌ దాడులను ముమ్మరం చేయడం గమనార్హం.

సెంట్రల్‌ గాజాలోని నోసైరాట్‌ ప్రాంతంలో శుక్రవారం అనేక వైమానిక దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 25 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అనేక చోట్ల భారీ విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. అనేక మంది తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గురువారం రాత్రి నుంచే దాడులు తీవ్రమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. మొత్తంగా వివిధ ప్రాంతాల్లో కలిసి సుమారు పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. భారత్‌ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లకు ప్రయాణించవద్దంటూ తమ పౌరులకు భారత్‌ అడ్వైజరీ జారీ చేసింది. ఫ్రాన్స్‌ సైతం తమ పౌరులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని