S Jaishankar: భారత్‌కు అప్పుడు అన్యాయం జరిగితే.. ప్రపంచం స్పందించలేదు: జైశంకర్‌

భారత్‌కు గతంలో అన్యాయం జరిగితే ప్రపంచం స్పందించలేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు.

Updated : 08 Mar 2024 18:24 IST

టోక్యో: గ్లోబల్ సౌత్‌ (Global South)లోని భాగస్వామ్య దేశాలకు భారత్‌పై నమ్మకం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) అన్నారు. చైనా మాత్రం ఆయా దేశాల సమస్యలు వినేందుకు గతేడాది భారత్‌ ఏర్పాటు చేసిన రెండు సమావేశాలకు రాలేదని తెలిపారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ఆయన ఓ కార్యక్రమంలో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. గతంలో భారత్‌కు అన్యాయం జరిగితే ప్రపంచం స్పందించలేదన్నారు.

అప్పుడు మాకు అన్యాయం జరిగింది

‘‘ప్రపంచ రాజకీయాల్లో కొన్ని దేశాలు ఒక సమస్యను తీసుకుని దాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తాయి. వాటి గురించి భారత్‌కు బాగా తెలుసు. మాకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే.. ఉద్రిక్తతలు ఎదుర్కొన్నాం. మా సరిహద్దులు మార్చే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ మా భూభాగం కొంత ఆక్రమణకు గురైంది. ప్రపంచం దాని గురించి మాట్లాడదు. ఇప్పుడు కొన్ని సూత్రాలు పాటించాలని భారత్‌కు చెబుతున్నాయి. ఇలాంటి వాటిని గత 80 ఏళ్లుగా చూస్తున్నా. అప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే ఇతర దేశాలకు జరగాలని కోరుకోవడంలేదు. ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. భారత ప్రధాని.. రష్యా అధ్యక్షుడివైపు ఉన్నారు. ఈ యుద్ధం ముగిసిపోవాలని మేము ఎదురుచూస్తున్నాం’’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. 

చైనా వైఖరిపై విమర్శలు

‘‘జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌ చేపట్టిన తర్వాత కూడా తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకోలేదని గ్లోబల్‌ సౌత్‌ దేశాలు భావించాయి. అందుకే గతేడాది 125 దేశాల సమస్యలు వినేందుకు రెండుసార్లు సమావేశాలను ఏర్పాటు చేశాం. కానీ, చైనా మాత్రం ఈ భేటీలకు హాజరుకాలేదు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో గ్లోబల్‌ సౌత్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ఆయా దేశాల సమస్యల గురించి ఎవరు ప్రస్తావిస్తున్నారనేది వాళ్లకు తెలుసు’’ అని జైశంకర్‌ అన్నారు. 

ఇరు దేశాల భాగస్వామ్యం మారదు

భారత్‌-జపాన్‌ల భాగస్వామ్యం ఇండో-పసిఫిక్‌ సహా, ఇరు దేశాలకు చెందిన అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రపంచంలో, ఇండో-పసిఫిక్‌లో మార్పులు జరిగినా.. భారత్‌ - జపాన్‌ మధ్య సంబంధాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. ఇరు దేశాల సంయుక్త కార్యకలాపాలు క్వాడ్‌ బలాన్ని మరింత విస్తృతం చేస్తాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని