Ebrahim Raisi: మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు

ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది.

Updated : 21 May 2024 07:13 IST

ఇదీ ఇబ్రహీం రైసీ ప్రస్థానం

టెహ్రాన్‌: ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. మత ప్రబోధకుడిగా జీవితం ఆరంభించారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహించారు.1988.. రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన సంవత్సరం. ఆ ఏడాది తన తోటి జడ్జీలతో కలిసి రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను అమలు చేశారు. దీంతో వామపక్ష భావాలున్న దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తీర్పుల నేపథ్యంలో ‘టెహ్రాన్‌ కసాయి’గా రైసీకి పేరొచ్చింది. అధ్యక్షుడిగా పోటీ చేసిన సందర్భంలోనూ మానవహక్కుల సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. గతంలో ఖురాన్‌ను ముద్దాడి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన చరిత్ర రైసీకి ఉంది. అధ్యక్షుడిగా ఎన్నికైనా ఓ పరిపాలనావేత్తగా ప్రవర్తించలేదని.. మత ప్రభోధకుడిగానే వ్యవహరించారన్నది ఆయనపై ప్రధాన విమర్శ.

పాత్ర పరిమితమే కానీ..

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం జరుగుతున్న వేళ రైసీ మరణం ఇరాన్‌కు ఎదురుదెబ్బే. ఎందుకంటే టెహ్రాన్‌ తన చరిత్రలోనే తొలిసారి ఇజ్రాయెల్‌పై ఇటీవల నేరుగా డ్రోన్లతో దాడి చేసింది. అణుశుద్ధి కార్యక్రమంలోనూ పురోగతి సాధించింది. రష్యా, చైనాలకూ దగ్గరవుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని తయారు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో పాలస్తీనియన్లకు అండగా నిలుస్తూ ముస్లిం దేశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి ఇరాన్‌లో అధ్యక్షుడిది పరిమితమైన పాత్రే. పెద్దగా అధికారాలు ఉండవు. నిర్ణయాధికారం ఖమేనీదే. కాకపోతే సుప్రీం అధినేతకు విధేయుడిగా, ఆయన ఆదేశాలను తూచ తప్పక రైసీ పాటిస్తూ వచ్చారు. అంతకు ముందు అధ్యక్షులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. రైసీ ఎన్నడూ ఖమేనీ మాట జవదాటలేదు. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ ఖమేనీ అనుకూల వ్యక్తి అధికార పీఠం ఎక్కేవరకు ఇరాన్‌లో రాజకీయ అస్థిరత కొనసాగే అవకాశం ఉంది.


ఖమేనీ ఆశీస్సులతోనే..

2015లో అమెరికాతో ఇరాన్‌ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ సంస్కరణలకు మొగ్గు చూపే హసన్‌ రౌహానీని ప్రజలు గెలిపించారు. అయినప్పటికీ ఖమేనీ అశీస్సులతో కీలక పదవుల్లో కొనసాగారు. దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు కూడగట్టుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు. అంతేకాదు.. భవిష్యత్తులో ఖమేనీ వారసుడిగా సుప్రీం నేతగా కూడా రైసీ పగ్గాలు చేపడతారని చాలా మంది భావించారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పాలనపై రైసీ చూపిన ముద్ర లేదనే చెప్పాలి. ఖమేనీ ఆదేశాలనే ఆయన శిరసావహిస్తూ వచ్చారు. 2022లో మాసా అమీని అనే యువతి హిజాబ్‌ ధరించలేదని ఇరాన్‌ నైతిక పోలీసులు దాడి చేసి చంపడంతో రైసీ సర్కారుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఆ అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయారు. 22 వేల మందికి పైగా పౌరులు నిర్బంధానికి గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు