Trump - Musk: ట్రంప్‌ గెలిస్తే వైట్‌హౌస్‌లోకి మస్క్‌!

Trump - Musk: రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే మస్క్‌ను సలహాదారుడిగా నియమించుకునే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు సమాచారం.

Updated : 30 May 2024 12:17 IST

Trump - Musk | వాషింగ్టన్‌: టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ను (Elon Musk) సలహాదారుడిగా నియమించుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్‌ హోదాలో అతణ్ని వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో వెల్లడించింది.

దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ట్రంప్‌, మస్క్‌ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారిద్దరి మధ్య తరచూ ఫోన్‌ సంభాషణలు జరుగుతున్నట్లు ట్రంప్‌ ప్రచార బృందంలోని కొంతమంది వెల్లడించారు. సరిహద్దు, ఆర్థిక, విద్యుత్తు వాహనాల వంటి విధానాల రూపకల్పనలో మస్క్‌ (Elon Musk) సలహాలు తీసుకోనున్నట్లు సమాచారం.

అమెరికా విధానాలను ప్రభావితం చేయగలిగే బడా వ్యాపారవేత్తగా మస్క్‌పై (Musk) ఇప్పటికే ముద్ర పడింది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. కొంత కాలంగా డైమోక్రాటిక్‌ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్నాయని బహిరంగంగానే విమర్శించారు. విద్యుత్ వాహనాలు, ఆర్థిక విధానాల్లోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ట్రంప్‌నకు మస్క్‌ దగ్గరవుతూ వస్తున్నారు. సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో ట్రంప్‌ (Donald Trump) గెలుపు తర్వాత ఆయన్ని కలిశారు. అనంతరం తాను ఏ పార్టీకి విరాళాలు ఇవ్వాలనుకోవడం లేదని మార్చిలో ప్రకటించారు. గతంలో ఇతర వ్యాపారవేత్తల తరహాలోనే ఇరు పార్టీలకు సమానంగా నిధులు సమకూర్చేవారు. ఈసారి మాత్రం బైడెన్‌ను ఓడించాలని తోటి వ్యాపారవేత్తలను ప్రభావితం చేస్తున్నారని సమాచారం. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌, ట్రంప్‌ తలపడనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని