దర్యాప్తు చేయకుండానే నిందలా..? నిజ్జర్ కేసులో కెనడాపై భారత్ ఆగ్రహం

నిజ్జర్ హత్యకేసు దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను కెనడా(Canada) అడుగుతోంది. దీనిపై భారత దౌత్యవేత్త మీడియాతో మాట్లాడారు. 

Published : 25 Nov 2023 15:09 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కేసు విషయంలో కెనడా(Canada) తీరుపై భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ ఫైర్ అయ్యారు. దర్యాప్తు కొలిక్కిరాకముందే భారత్‌ను దోషిని చేశారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ట్రూడో చేసిన ఆరోపణల గురించి  ప్రశ్నించగా.. ‘ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. హత్యకేసులో దర్యాప్తు ఒక కొలిక్కి రాకముందే భారత్‌ను దోషిగా నిర్ధారణ చేశారు. ఇదేనా చట్ట పాలనా..?’ అని సంజయ్‌ కుమార్‌ వర్మ అన్నారు. ‘భారత్‌ను విచారణకు సహకరించమని అడుగుతున్నారు. క్రిమినల్ టర్మినాలజీ గమనిస్తే.. ఎవరినైనా విచారణకు సహకరించమని అడిగితే, వారు అప్పటికే దోషి అని అర్థం’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని ఇప్పటికే తాము పలుమార్లు కెనడాను అడిగామని గుర్తు చేశారు. వాటిని పరిశీలించడానికి భారత ప్రభత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఇదివరకు కూడా సంజయ్ వర్మ కెనడా ఉన్నతాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్‌లో నిజ్జర్‌ హత్య తర్వాత కెనడా పోలీసులు చేపట్టిన దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయిలో అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారని ఆరోపించారు. ‘కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారు. ఈ హత్యలో భారత్‌ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయి’ అని ఘాటుగా స్పందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు