Erdogan: సొంత సిబ్బందినే రక్షించుకోలేని ఐరాస.. దేనికోసం ఎదురుచూస్తోంది: ఎర్డోగన్

గాజాలో ఐక్యరాజ్య సమితి స్ఫూర్తి మంటగలిసిందని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ (Erdogan) మండిపడ్డారు. 

Updated : 29 May 2024 18:23 IST

ఇస్తాంబుల్‌: రఫాలో ఇజ్రాయెల్‌ జరిపిన పాశవిక దాడిపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ (Erdogan)తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి (UN) పనితీరును ఎండగట్టారు. ఇస్లామిక్ ప్రపంచం దీనిపై స్పందించాలని పిలుపునిచ్చారు.

‘‘ఐక్యరాజ్య సమితి కనీసం తన సిబ్బందిని కూడా రక్షించుకోలేకపోయింది. ఇంకా దేనికోసం వేచి చూస్తోంది? గాజాలో ఐరాస స్ఫూర్తి మంటగలిసింది’’ అని ఎర్డోగన్ మండిపడ్డారు. రఫాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడి గురించి ఐరాస భద్రతామండలి సమావేశమైన తరుణంలో ఆయన్నుంచి ఈ స్పందన వచ్చింది. ఈసందర్భంగా తన తోటి ముస్లిం దేశాలు అవలంబిస్తోన్న వైఖరిని తప్పుపట్టారు. ఉమ్మడి నిర్ణయం తీసుకునే విషయంలో ఇంకా దేనికోసం వేచిచూస్తున్నారని ప్రశ్నించారు. ఇజ్రాయెల్ ఒక్క గాజాకే కాకుండా మొత్తం మానవాళికే ముప్పు అని అన్నారు. అది అంతర్జాతీయ చట్టాలను అనుసరించనంతకాలం ఏ ఒక్క దేశమూ సురక్షితం కాదని వ్యాఖ్యానించారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ.. ఇజ్రాయెల్‌ దాడుల్లో సోమవారం రాత్రి, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందడం గమనార్హం. అక్కడి దృశ్యాలు వెలుగులోకి వస్తోన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తూ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని