44 ఏళ్ల నాటి మాజీ ప్రధాని భుట్టో ఉరిశిక్ష కేసు.. నేడు పాక్‌ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తాను నియమించిన సైనికాధికారి ప్రమేయం వల్లే పాకిస్థాన్‌ మాజీ ప్రధాని జుల్ఫీకర్‌ అలీ భుట్టో (Zulfikar Bhutto) ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయనకు పడిన మరణశిక్షపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

Published : 06 Mar 2024 19:41 IST

ఇస్లామాబాద్‌: నాలుగు దశాబ్దాల క్రితం పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి జుల్ఫీకర్‌ అలీ భుట్టో (Zulfikar Bhutto)కు విధించిన మరణశిక్షపై బుధవారం పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ హత్య కుట్ర కేసులో జుల్ఫీకర్‌ భుట్టో దోషిగా తేలడంతో.. 1979లో ఆయన్ను ఉరితీశారు. ఆ కేసులో న్యాయ విచారణ సక్రమంగా జరగలేదని తాజాగా కోర్టు వెల్లడించింది. దీనిపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా వెల్లడించారు.

అప్పటి సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ ప్రమేయంతోనే ఈ ఉరిశిక్ష అమలైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన 32 ఏళ్ల తర్వాత 2011లో అప్పటి అధికార ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ’ ప్రభుత్వం.. ఈ కేసును తిరిగి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. అప్పటి పాక్‌ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ దీనికి అనుమతించారు. చివరిసారి 2012 జనవరిలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి నేతృత్వంలోని 11 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఈ కేసును విచారించిన అనంతరం పక్కన పెట్టింది. అయితే గత ఏడాది ఈ కేసు విచారణ ప్రక్రియ పునఃప్రారంభమైంది. జుల్ఫీకర్‌ మనవడు, పాక్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అభ్యర్థన మేరకు ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘ఈ మాటలు వినడానికి మాకు మూడు తరాలు పట్టింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తాను నియమించిన సైనికాధికారి చేతుల్లోనే..!

జుల్ఫీకర్‌ అలీ భుట్టో పాకిస్థాన్‌లోని అప్రజాస్వామిక శక్తులకు వ్యతిరేకంగా నిలిచారు. 1971-73 వరకు దేశాధ్యక్షుడిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జుల్ఫీకర్‌ అలీ భుట్టో.. చివరకు తాను నియమించిన మిలిటరీ చీఫ్‌ చేతుల్లోనే మరణించారు. భుట్టో హయాంలోనే పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయింది. భారత్‌తో సిమ్లా ఒప్పందం చేసుకున్న జుల్ఫీకర్‌పై.. తాను నియమించిన మిలిటరీ చీఫ్‌ జియా ఉల్‌హక్‌ 1977లో తిరుగుబాటు చేశాడు. తర్వాత ఆయనపై హత్య కుట్ర కేసు, మార్షల్‌ లా కింద కేసులు పెట్టారు. ఈక్రమంలోనే భుట్టోకు ఉరి శిక్ష పడింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎవరెంత ఒత్తిడి చేసినా కనికరించని జియా ఉల్‌ హక్‌ 1979లో భుట్టోను ఉరి తీయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని