Russia-Ukraine: రష్యా గ్యాస్‌ ఎగుమతి టెర్మినల్‌లో భారీ పేలుడు

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ గ్యాస్‌ ఎగుమతి టెర్మినల్‌లో భారీ పేలుడు సంభవించింది. 

Published : 21 Jan 2024 17:16 IST

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (St Petersburg) నగరం సమీపంలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్‌ ఎగుమతి టెర్మినల్‌లో (Gas Exporting terminal) ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. ఘటనాస్థలికి సమీపంలోనే విదేశాలకు చెందిన మూడు భారీ ట్యాంకర్లు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, వాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

పేలుడు జరిగిన సమయంలో కొన్ని డ్రోన్‌లు ఆ ప్రాంతంలో సంచరించినట్లు స్థానిక మీడియా మేర్కొంది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఇటీవల డ్రోన్‌ దాడులు ఎక్కువవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌లో ఆదివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు రష్యా ఆరోపిస్తోంది. అక్కడికి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ డ్రోడ్జెన్‌కో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు