Dhaka: బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి, వంద మందికి పైగా గాయాలు

బంగ్లాదేశ్‌లోని పాత ఢాకాలో భారీ పేలుడు ఘటనలో 16మంది మృతి చెందగా.. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు.

Updated : 07 Mar 2023 20:59 IST

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా(Dhaka)లో మరో భారీ పేలుడు(explosion) సంభవించింది.  పాత ఢాకాలోని రద్దీగా ఉండే సిద్ధిక్‌బజార్‌లోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. సిద్దిక్‌ బజార్‌లో... సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 4.50గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఢాకా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి భవనంలోని తొలి రెండు అంతస్తులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని అక్కడి మీడియా పేర్కొంది. ఈ భవనంలోని కింది అంతస్తులో శానిటరీ ఉత్పత్తులు, గృహోపకరణాలకు సంబంధించిన దుకాణాలు ఉండగా..  భవనం పక్కనే ఓ బ్యాంకు శాఖ ఉంది.

అయితే, ఈ బాంబు పేలుడు తీవ్రతతో భవనం గోడ కూలిపోగా.. అక్కడి సామగ్రి వీధుల్లోకి ఎగిరిపడింది. అలాగే, రోడ్డుకు ఎదురుగా ఉన్న బస్సుసైతం ధ్వంసమైంది. ఈ భవనానికి ఆనుకొని ఉన్న బ్యాంకులో అద్దాలు పగలడంతో ఆ గాజు పెంకులు తగిలి పలువురు ఉద్యోగులకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఇది మూడో పేలుడు ఘటన కావడం గమనార్హం. గతంలో   ఆక్సిజన్ ప్లాంట్‌లో పేలుడు జరగ్గా.. ఇటీవల ఢాకాలోని మిర్పూర్ రోడ్‌లో ఉన్న మరో భవనంలో పేలుళ్లు సంభవించిన ఘటనలు మరిచిపోకముందే తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని