Ukraine Crisis: ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య!

ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత వోల్నోవొకాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కొందరు దుండగులు హత్య చేశారు. దీనిపై ఇరుదేశాల అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Published : 31 Oct 2023 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాతో (Russia) యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌లో (Ukraine) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రష్యా ఆక్రమిత వోల్నోవొకా పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన.. ఉక్రెయిన్‌ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యాకు చెందిన సైనికులే ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రష్యా సైనికుల దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు బాధిత కుటుంబం నివసిస్తున్న ఇంటికి వచ్చి.. వెంటనే ఖాళీ చేసి ఇంటిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారని,  కుటుంబ పెద్ద తిరస్కరించడంతో కాల్పులు జరిపి అందర్నీ హతమార్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఇరుదేశాల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రష్యన్‌ దర్యాప్తు అధికారులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని రష్యా తూర్పు భాగం నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశం ఫొటోని దొనెట్స్క్‌ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘నిద్రిస్తున్న కుటుంబంపై కాల్పులు జరిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ రష్యా సైనికులు డిమాండ్‌ చేశారని, అందుకు తిరస్కరించడంతో కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్నారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది.

యుద్ధ నిబంధనలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా ఘటనలపై ముందస్తు విచారణ ప్రారంభించినట్లు ఉక్రేనియన్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం తెలిపింది. తాజా ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు విభాగానికి అప్పగించినట్లు వెల్లడించింది. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో రష్యా దళాల దాడులను ఉక్రేనియన్‌ బలగాలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోని కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని ఉక్రెయిన్‌ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు