Ukraine: యుద్ధం ఆగదు.. కానీ నెమ్మదిస్తుంది..: అమెరికా ఇంటెలిజెన్స్‌

ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి లేదు. కాకపోతే తీవ్రత కొంత తగ్గవచ్చని అమెరికా అభిప్రాయపడింది. 

Published : 05 Dec 2022 01:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం ఆగదని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనావేశాయి. శీతాకాలం నేపథ్యంలో దాడుల వేగం మందగిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ ఆవ్రిల్‌ హెయిన్స్‌ వెల్లడించారు. శీతాకాలం తర్వాత దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యేందుకు ఇరు దేశాలు యత్నిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌ మౌలిక వసతులపై రష్యా దాడులు చేస్తోనే ఉంది. ఈ యుద్ధం తొమ్మిదో నెలకు చేరుకోగా.. స్వాధీనం చేసుకొన్న భూభాగాల్లో సగానికిపైగా రష్యా కోల్పోయిందన్నారు. ప్రస్తుతం యుద్ధం మొత్తం తూర్పు ఉక్రెయిన్‌లో బక్మమట్‌, దొనెట్స్క్‌ వద్ద కేంద్రీకృతమైంది. పశ్చిమ ఖేర్సాన్‌ వద్ద  రష్యా దళాలను ఉపసంహరించిన తర్వాత యుద్ధం వేగం కొంత తగ్గింది. పుతిన్‌ తన సైన్యానికి ఇటువంటి సవాలు ఎదురవుతుందని ఊహించి ఉండరని హెయిన్స్‌ అభిప్రాయపడ్డారు. రష్యన్లు ప్రస్తుతం మందుగుండు కొరత, దెబ్బతిన్న నైతిక స్థైర్యం, లాజిస్టిక్స్‌ సమస్యలును ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

మరోవైపు రష్యా పై ఒత్తిడి పెంచేందుకు పశ్చిమ దేశాలు చమురు ధరపై ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించాయి. రష్యా నుంచి వచ్చే చమురుకు 60 డాలర్ల కంటే ఎక్కువ చెల్లించకూడాదని నిర్ణయించాయి. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయలేదని వెల్లడించారు. ఇది కఠిన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. మరో వైపు చమురు ధరపై ఆంక్షల విషయంలో రష్యా స్పష్టంగా ఉంది. 60 డాలర్ల కంటే తక్కువకు తాము చమురును విక్రయించమని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని