NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
నాటో (NATO) కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్‌కు (Finland) మార్గం దాదాపు సుగమమైంది. నాటో చీఫ్ స్టోలెన్‌బెర్గ్ (Jens Stoltenberg) చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి.
బ్రసెల్స్: నార్డిక్ (Nordic) దేశమైన ఫిన్లాండ్ (Finland) నాటో (NATO) కూటమిలో చేరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బెర్గ్ (Jens Stoltenberg) చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఫిన్లాండ్ నాటో సభ్యదేశం కాబోతోందని ఆయన అన్నారు. స్థానిక పరిస్థితులను సానుకూలంగా మార్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడిని ఆయన అభినందించారు.‘‘ నాటో ప్రధాన కార్యాలయంలో ఫిన్లాండ్ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుందా? అని ఎదురు చూస్తున్నాను. ఆ దేశం మా సరసన చేరితే మేం మరింత దృఢంగా, క్షేమంగా ఉంటాం’’ అని స్టోలెన్‌బెర్గ్ ట్విటర్‌లో రాసుకొచ్చారు. నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను నార్డిక్ దేశాలుగా చెబుతారు.
నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరికపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తుర్కియే కూడా గురువారం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు అక్కడి పార్లమెంట్ తీర్మానించింది. దీంతో ఫిన్లాండ్ చేరికకు దాదాపు మార్గం సుగమైనట్లే . ఫిన్లాండ్ రక్షణ పరంగా పటిష్ఠంగా ఉందని, ఆ దేశ శక్తిసామర్థ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు నాటో కూటమిని మరింత దృఢంగా తయారు చేస్తాయని స్టోలెన్‌బెర్గ్ అభిప్రాయపడ్డారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో వచ్చేవారం నాటో సభ్యదేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఫిన్లాండ్ సభ్యత్వంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నాటో.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనినే ఉత్తర అట్లాంటిక్ కూటమి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడంతో పాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్ నాటోలో చేరికపై ప్రజల నుంచి మద్దతు లభించింది. ఫిన్లాండ్ 1,300 కిలోమీటర్ల సరిహద్దులను రష్యాతో పంచుకొంటోంది. ఇప్పటి వరకు రష్యాతో విరోధం వద్దునుకొని ఫిన్లాండ్ నాటోలో చేరలేదు. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో నాటోలో చేరేందుకు మొగ్గు చూపింది. అయితే, ఫిన్లాండ్ చేరికపై తుర్కియే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిన్లాండ్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని అందుకే ఆదేశం నాటోలో చేర్చుకోవడంపై సదాభిప్రాయం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే, తాజాగా తుర్కియే కూడా అనుకూలంగా స్పందించడంతో ఫిన్లాండ్ చేరిక అనివార్యమనే చెప్పాలి. ఒక దేశం.. నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. ముందుగా కూటమిలోని 30 సభ్యత్వ దేశాలు దానికి అధికారిక ఆహ్వానాన్ని అందించేందుకు ఏకగ్రీవంగా అంగీకరించాలి. అనంతరం.. సభ్యత్వంపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత.. సభ్య దేశాలు తుది నిర్ణయాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
World News
అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!