Arunachal Pradesh: అమెరికాది రెచ్చగొట్టే ధోరణి.. ‘అరుణాచల్‌’ మాదే: చైనా

అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌దేననంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైనా తెలిపింది. ఈ వివాదంతో వాషింగ్టన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Published : 21 Mar 2024 20:14 IST

బీజింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) ఎప్పటికీ భారత్‌దేనంటూ అమెరికా (USA) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చైనా (China) తెలిపింది. తమ ఇరుదేశాల సరిహద్దు వివాదంతో వాషింగ్టన్‌కు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ స్పందించారు.

‘‘చైనా- భారత్ సరిహద్దుల డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. జాంగ్నాన్ (అరుణాచల్‌కు చైనా పేరు) ఎల్లప్పుడూ మా భూభాగమే. ఇది కాదనలేని వాస్తవం. ఇది మా రెండు దేశాల సరిహద్దు సమస్య. అమెరికాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఆ దేశం తన స్వార్థ భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర దేశాల వివాదాలను రెచ్చగొట్టడం, ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందే’’ అని జియాన్‌ వ్యాఖ్యానించారు.

అరుణాచల్‌ భారత్‌దే.. చైనాకు తేల్చిచెప్పిన అగ్రరాజ్యం

చైనా- భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. అయితే.. అది తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని బీజింగ్‌ ఇటీవల నోరు పారేసుకుంది.    డ్రాగన్‌ సైన్యం సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేయగా, వీటిని భారత్‌ దీటుగా తిప్పికొట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని