Virgin Atlantic: వంట నూనె ఇంధనంగా.. దూసుకెళ్లిన తొలి కమర్షియల్‌ విమానం!

వందశాతం సుస్థిర విమాన ఇంధనం (SAF) ఉపయోగించి వర్జిన్‌ అట్లాంటిక్‌ కమర్షియల్‌ విమానం రికార్డు సృష్టించింది.

Updated : 30 Nov 2023 21:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జెట్‌ ఫ్యూయల్‌తో కాకుండా వంట నూనె (Cooking oil) ఇంధనంగా వర్జిన్‌ అట్లాంటిక్‌ కమర్షియల్‌ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో వందశాతం సుస్థిర విమాన ఇంధనం (SAF) వినియోగించిన తొలి వాణిజ్య విమానంగా రికార్డు సృష్టించింది. సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌గా పిలిచే ఈ ఇంధనంతో గతంలో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (Royal Air Force) సరకు రవాణా విమానాన్ని నడిపించినప్పటికీ.. వందశాతం వంటనూనెతో నడిచిన ప్రయాణికుల విమానం మాత్రం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

వంటనూనె ఇంధనం కలిగిన వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం లండన్‌ (Heathrow) నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. వర్జిన్‌ అట్లాంటిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సెక్రటరీ మార్క్‌ హార్పర్‌ సహా ఇతర సిబ్బంది మాత్రమే అందులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులను మాత్రం అనుమతించలేదు. 38వేల అడుగుల ఎత్తులో.. అట్లాంటిక్‌ సముద్రం మీదుగా ప్రయాణించి చరిత్ర సృష్టించినట్లు వర్జిన్‌ విమానయాన సంస్థ వెల్లడించింది.

ఏమిటీ ఎస్‌ఏఎఫ్‌..?

సాధారణంగా జెట్‌ ఫ్యుయెల్‌ ఆధారంగానే విమానాలు ప్రయాణిస్తుంటాయి. కానీ, వీటివల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్వేషణ సాగుతోంది. ఇందులో భాగంగా సుస్థిర విమాన ఇంధనం (Sustainable Aviation Fuel) తయారీపై ఇంధన సంస్థలు దృష్టి సారించాయి.

దేనితో తయారు చేస్తారు..?

సుస్థిర విమాన ఇంధనాన్ని రకరకాల పదార్థాలు, వ్యర్థాలు, పునరుత్పాదక బయోమాస్‌తో తయారుచేస్తారు. వేపుళ్ల వంటివి వండిన తర్వాత మిగిలి పోయిన నూనెలు, కొవ్వు పదార్థాలూ దీని తయారీలో వాడతారు. నూనె శాతం ఎక్కువగా ఉండే క్యామెలీనాను ఇందులో వినియోగిస్తారు. సంప్రదాయ విమాన ఇంధనంలోనూ ఈ ఎస్‌ఏఎఫ్‌ను గరిష్ఠంగా 50శాతం వరకు వాడుకోవచ్చు. సుస్థిర విమాన ఇంధనాన్ని వాణిజ్యపరంగా విమాన ప్రయాణాలకు వాడుకునేందుకు 2011లోనే ఆమోదం లభించింది. ఇటీవల రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ తరహా విమానాన్ని నడిపించగా.. తాజాగా వందశాతం సుస్థిర ఇంధనంతో వర్జిన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుల విమానం సుదీర్ఘ ప్రయాణం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని