Tokyo plane Accident: టోక్యో విమాన ప్రమాదం.. కోస్టుగార్డు సిబ్బంది మృతి

టోక్యోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు కోస్టుగార్డు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్‌ మీడియా వెల్లడించింది.

Published : 02 Jan 2024 20:48 IST

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యో (Tokyo)లోని హనేడా విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కోస్టుగార్డు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హొక్కైడో విమానాశ్రయం నుంచి బయల్దేరిన జేఏఎల్‌ 516 విమానం హనేడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న సమయంలో జపాన్‌ కోస్టు గార్డుకు చెందిన విమానాన్ని ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జేఏఎల్‌ 516లోని సిబ్బంది, 379 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కోస్టు గార్డు విమానంలోని ఆరుగురు సిబ్బందిలో ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకురాగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు వారి ఆచూకీ లభ్యం కాలేదంటూ కోస్టుగార్డు అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

సరకులు తీసుకెళ్తూ.. మృత్యు ఒడికి

భూకంప బాధితులకు సాయం చేసేందుకు వెళ్తున్న క్రమంలో కోస్టు గార్డు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్తోంది. జపాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్న తరుణంలో.. బాధితులకు అవసరమైన సరకులు చేరవేసేందుకు కోస్టు గార్డు విమానం హనేడా ఎయిర్‌పోర్టు నుంచి పశ్చిమ జపాన్‌లోని నిజటాకు బయల్దేరాల్సి ఉంది. రన్‌ వే క్లియరెన్స్‌ కోసం వేచి చూస్తోంది. అంతలోనే జేఏఎల్‌ 516 విమానం ల్యాండ్‌ అయి దానిని ఢీ కొట్టింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, మంటలు వ్యాపించాయి. అందులో చిక్కుకున్న విమానం కొంతదూరం వెళ్లి ఆగిన తర్వాత ప్రయాణికులంతా బయటకు వచ్చేశారు. కానీ, కోస్టుగార్డు విమానంలో ఉన్న ఆరుగురిలో ఐదుమంది మృత్యువాత పడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విమానాశ్రయ అధికారులు ఆరా తీస్తున్నారు. సిగ్నలింగ్‌ లోపం వల్లే ప్రమాదం జరిగిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు