China Banker: లంచాలు తీసుకున్న బ్యాంకు అధికారికి మరణశిక్ష!

 లంచాలు తీసుకున్న కేసులో ఓ బ్యాంకు మాజీ అధికారికి మరణశిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Published : 29 May 2024 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవినీతికి పాల్పడే అధికారులపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో లంచాలు తీసుకున్న కేసులో ఓ బ్యాంకు మాజీ అధికారి దోషిగా తేలాడు. అభియోగాలు రుజువు కావడంతో అతడికి మరణశిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అదే బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారికి మూడేళ్ల క్రితం అదే కోర్టు మరణశిక్ష విధించడం గమనార్హం.

చైనా హువారోంగ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (CHIH) అనేది చైనా హువారోంగ్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ ఆఫ్‌షోర్‌ కంపెనీ. ఇందులో బెయ్‌ తియాన్‌హుయ్‌ అనే వ్యక్తి గతంలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక ప్రాజెక్టులకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని.. ఇందులో భారీ స్థాయిలో నగదు చేతులు మారాయని వెల్లడైంది. మొత్తంగా 1.1 బిలియన్‌ యువాన్‌ (రూ.1264కోట్లు)లను లంచం రూపంలో  ఆయన తీసుకున్నట్లు తేలింది. విచారించిన స్థానిక న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, దీనిపై అప్పీలుకు వెళ్తాడా? లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. మరణశిక్ష నుంచి బయటపడటం కష్టమనే చెబుతున్నారు.

భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించాం-అంగీకరించిన నవాజ్‌ షరీఫ్‌

దశాబ్దం క్రితం చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్.. దేశంలో అవినీతి వ్యతిరేక చర్యలను ముమ్మరం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది అవినీతి అధికారులు పట్టుబడ్డారు. ఇలాంటి వారికి మరణశిక్ష విధించడం అత్యంత అరుదనే చెప్పవచ్చు. అయితే, సీహెచ్‌ఐహెచ్‌లో అవినీతికి పాల్పడి మరణశిక్ష పొందిన రెండో వ్యక్తిగా బెయ్‌ నిలిచారు. జనవరి 2021లో బెయ్‌ మాజీ బాస్‌ అయిన లాయ్‌ షియోమిన్‌ ఇదే కోర్టు మరణ శిక్ష విధించింది. మరుసటి నెల అతడికి ఉరిశిక్ష అమలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని