Eric Schmidt: ఏఐతో ముప్పే.. గూగుల్‌ మాజీ సీఈవో హెచ్చరిక

కృత్రిమ మేధను (Artificial Intelligence) సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో మానవాళికి ముప్పు తప్పదని గూగుల్‌ మాజీ సీఈవో ఎరిక్‌ ష్మిత్ హెచ్చరించారు.

Published : 26 May 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని పలువురు టెక్‌ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్‌ మాజీ సీఈవో ఎరిక్‌ ష్మిత్‌ కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధపై నియంత్రణ లేకుంటే రానున్న రోజుల్లో మానవాళికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సీఈవో కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు. గూగుల్‌ సీఈవోగా 2001 నుంచి 2011 వరకు కొనసాగిన ఎరిక్‌ ష్మిత్.. 2015 నుంచి 2017 వరకు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

‘ఎంతో మంది చెప్పినట్లుగా కృత్రిమ మేధతో అస్తిత్వ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాకపోయినా.. సమీప భవిష్యత్తులో వీటి నుంచి ముప్పు ఉంటుంది. నేడు ఇది కల్పన మాత్రమే అయినప్పటికీ అది వాస్తవరూపం దాల్చవచ్చు. అటువంటిది సంభవించినప్పుడు అవి చెడు వ్యక్తుల బారినపడి దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి’ అని ఎరిక్‌  పేర్కొన్నారు. అణు సాంకేతికతతో పోల్చిన ఆయన.. ఏఐ వ్యాప్తిని నియంత్రించడం అత్యంత కష్టమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ సంస్థలైన ఓపెన్‌ ఏఐ, గూగుల్‌ డీప్‌మైండ్‌ అధినేతలతోపాటు బ్రిటన్‌ ప్రధాని పాల్గొన్న ఈ సమావేశంలో ఎరిక్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

వేగంగా వృద్ధి చెందుతోన్న కృత్రిమ మేధ, దాని దుష్ర్పభావాలపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai), టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తోపాటు ఇతర టెక్‌ దిగ్గజ సంస్థల అధినేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతికతను (Artificial Intelligence) సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించిన పిచాయ్‌.. వాటి దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఇటీవల పేర్కొన్నారు. మరోవైపు బిల్‌గేట్స్‌ మాత్రం ఇటీవల ఏఐ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. అయితే, వీటిపై టెక్‌ దిగ్గజాధినేతల ఆందోళనను అంగీకరించిన గేట్స్‌.. సాంకేతికత పరిజ్ఞానానికి సంబంధించి ప్రభుత్వ నియంత్రణ అవసరమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు