Test Tube Babies: జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!

గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.

Published : 18 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ నుంచి చేస్తోన్న ఈ దాడుల్లో 33వేల మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఈ క్రమంలో ఓ ఊహించని అంశం వెలుగులోకి వచ్చింది. కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు తేలింది. ఈ పరిణామం సంతానం కోసం ఎదురుచూస్తోన్న వేలాది మంది దంపతుల ఆశలకు గండికొట్టినట్లయింది.

గాజా యుద్ధంలో భాగంగా అక్కడి అతిపెద్ద వైద్య కేంద్రాల్లో ఒకటైన అల్‌ బాస్మా ఐవీఎఫ్‌ సెంటర్‌పై ఇజ్రాయెల్‌ సేనలు గతేడాది డిసెంబర్‌లో దాడులు జరిపాయి. ఆ ప్రభావంతో ఆసుపత్రిలోని ఎంబ్రియాలజీ యూనిట్‌లో ఉన్న ఐదు లిక్విడ్‌ నైట్రోజన్‌ ట్యాంకులు దెబ్బతిన్నాయి. అత్యంత శీతలంగా ఉండే ద్రవం ఆవిరైపోవడంతో.. ట్యాంకుల లోపల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాంతో అందులో ఉన్న వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలతోపాటు ఫలదీకరణం చెందని అండాలు ఛిద్రమైనట్లు గుర్తించారు. ఈ పరిణామం సంతానం లేని వందల మంది పాలస్తీనీయన్‌ దంపతులకు తీరని వేదనను మిగిల్చిందని ఐవీఎఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు వెల్లడించారు.

‘దాదాపు ఐదు వేల నమూనాల్లో ప్రాణాలు లేదా జీవం పోసుకునే అవకాశం ఉన్నవి అధికంగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా దంపతుల నుంచి మళ్లీ నమూనాలు సేకరించడం కష్టమే. ఇవన్నీ నాశనం కావడం చూస్తుంటే నా హృదయం ముక్కలై పోయింది’ అని ఐవీఎఫ్‌ సెంటర్ నిర్వహిస్తోన్న డాక్టర్‌ బహేలిద్దీన్‌ ఘలాయినీ వాపోయారు. ఐవీఎఫ్‌ పద్ధతిలో సంతానం పొందేందుకు అయ్యే ఖర్చు కోసం ఎంతో మంది దంపతులు తమ టీవీలు, నగలను సైతం అమ్ముకున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని