బాలాకోట్‌ దాడి తర్వాత అణుదాడికి సిద్ధమైన పాక్‌

బాలాకోట్‌ మెరుపుదాడుల (2019) అనంతరం భారత్‌పై అణ్వాయుధాలతో దాడికి పాకిస్థాన్‌ సిద్ధమైందనీ, ఈ విషయాన్ని అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తనకు వెల్లడించారని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు.

Updated : 25 Jan 2023 05:23 IST

సకాలంలో జోక్యంతో అనర్థాన్ని నిలువరించాం: పాంపియో

వాషింగ్టన్‌: బాలాకోట్‌ మెరుపుదాడుల (2019) అనంతరం భారత్‌పై అణ్వాయుధాలతో దాడికి పాకిస్థాన్‌ సిద్ధమైందనీ, ఈ విషయాన్ని అప్పటి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తనకు వెల్లడించారని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. పాక్‌ అణుదాడికి తగిన జవాబు చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోందన్న ఆమె మాటలతోనే ఆరోజు తాను నిద్రలేచానని తెలిపారు. ‘నెవర్‌ గివ్‌ యాన్‌ ఇంచ్‌: ఫైటింగ్‌ ఫర్‌ ది అమెరికా ఐ లవ్‌’ పేరుతో రచించిన తాజా పుస్తకంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ‘‘బాలాకోట్‌ మెరుపుదాడుల సమయంలో నేను హనోయీలో అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర సదస్సులో ఉన్నాను. అణుయుద్ధం నివారించడంలో భారత్‌, పాకిస్థాన్‌లతో మా బృందం ఆరోజు రాత్రంతా ఎంతో ప్రయత్నించింది. విషయం తెలియగానే సమస్య పరిష్కారానికి ఒక్క నిమిషం సమయం ఇవ్వాలని సుష్మాస్వరాజ్‌ను అడిగాను. వెంటనే అప్పటి పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాతో మాట్లాడాను. భారత్‌ ఏం చెప్పిందో ఆయనకు చెప్పాను. అది నిజం కాదని ఆయనన్నారు. భారతదేశమే తమపై అణ్వస్త్రాలు ప్రయోగించబోతోందని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అవతలి పక్షం అణ్వాయుధ పోరుకు దిగడం లేదని రెండు దేశాలకూ తెలియపరిచాం. భయానక అనర్థాన్ని నివారించడానికి ఆరోజు మేం చేసినంత పనిని మరే దేశం చేసి ఉండదు’’ అని ఆయన తాజా పుస్తకంలో రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు