America: యువకుడిపై అమెరికా పోలీసుల కర్కశత్వం

అమెరికాలో పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. మెంఫిస్‌ నగరంలో ఈ నెల మొదటి వారంలో టైర్‌ నికోల్స్‌ అనే యువకుడిపై కొంత మంది పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో అతడు మృతి చెందాడు.

Updated : 29 Jan 2023 07:51 IST

రోడ్డుపైనే ముష్టిఘాతాలు, విద్యుత్‌ షాక్‌లతో హింస.. బాధితుడి మృతి
ఫుటేజీ విడుదలతో వెలుగులోకి దారుణం

మెంఫిస్‌: అమెరికాలో పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. మెంఫిస్‌ నగరంలో ఈ నెల మొదటి వారంలో టైర్‌ నికోల్స్‌ అనే యువకుడిపై కొంత మంది పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. మృతుడు, దాడిచేసిన పోలీసులూ నల్లజాతీయులే. దాడికి సంబంధించిన మొత్తం ఫుటేజ్‌ను అధికారిక వర్గాలు విడుదల చేశాయి. ఇందులోని దృశ్యాలు హృదయవిదారకంగా ఉండటంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కిందపడేసి.. కుళ్లబొడిచి.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతోనే మెంఫిస్‌ నగర పోలీసులు టైర్‌ నికోల్స్‌ను ఆపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన వీడియోలలో అలా లేదు. తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పటికీ.. పోలీసులు అతడితో అత్యంత నిర్దయగా వ్యవహరించడం కనిపిస్తోంది. ముందుగా అతడిని  కారు లోంచి బయటకు లాగారు. చేతులు విరగ్గొట్టమని ఒక పోలీసు ఆదేశించగా.. అతడిని రోడ్డుపై పడదోసి కాళ్లతో తొక్కిపెట్టడం కనిపించింది. బాధితుడు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగుతీయగా.. వెంబడించిన పోలీసులు అతడు పట్టుబడిన వెంటనే పెప్పర్‌ స్ప్రే, ఎలక్ట్రిక్‌ షాకిచ్చే వెపన్‌ ఉపయోగించారు. ఎలాంటి కనికరం లేకుండా చాలాసేపు ముష్టిఘాతాలు కురిపించారు. అతడు బాధతో విలవిల్లాడుతూ వదిలేయమని ప్రాధేయపడడం వీడియోల్లో వినిపిస్తోంది. అనంతరం తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7న ఈ ఘటన జరగగా.. చికిత్స పొందుతూ నికోల్స్‌ 10వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులపై సెకండ్‌ డిగ్రీ హత్యా నేరం కింద అభియోగాలు మోపారు. నికోల్స్‌ మృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. మెంఫిస్‌ నగరం మొత్తం స్తంభించిపోయింది ఇక్కడి పాఠశాలలు, క్రీడా పోటీలు, వ్యాపార సమావేశాలు రద్దయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని