పుతిన్‌పై ఐసీసీ వారెంటు అమలు అసాధ్యమే

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంటు ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Published : 19 Mar 2023 04:26 IST

నిపుణుల విశ్లేషణ

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంటు ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాకు వర్తించబోవని క్రెమ్లిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. పుతిన్‌ను అదుపులోకి తీసుకోవడం అసాధ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో రష్యా బాలల హక్కుల కమిషనర్‌ మారియా ల్వోవా బెలోవాపై కూడా ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్‌పై వారెంట్‌ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన సమయంలో ఈ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. ఈ అంశంపై నిపుణుల విశ్లేషణ ఇదీ.

* అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే.. మారణహోమం, మానవత్వంపై దాడులు, యుద్ధ నేరాల వంటి అత్యంత తీవ్రమైన నేరాలను ఐసీసీ విచారిస్తుంది. కానీ అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు ఆ న్యాయస్థానానికి లేవు.

* ఐసీసీ ఒప్పందంపై రష్యా సంతకం చేయలేదు. దీంతో అనుమానితులను అప్పగించడం అసాధ్యం.

* అధ్యక్షుడిగా పుతిన్‌కు స్వదేశంలో సర్వాధికారాలు ఉన్నాయి. రష్యాలో ఉన్నంత వరకు ఆయనకు అరెస్టు భయం లేదు. ఒకవేళ స్వదేశాన్ని వీడితే ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రయాణాల విషయంలో పుతిన్‌ అప్రమత్తమయ్యే అవకాశం ఉంది.

* ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో.. పుతిన్‌పై దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. అందువల్ల ఐసీసీ ఆదేశాలు అమలు చేయాలనుకునే దేశాల్లో పుతిన్‌ పర్యటించడం కుదరకపోవచ్చన్న భావన ఉంది. అయితే ఆయన పర్యటించినా.. సంబంధిత దేశం ఆయనను అరెస్టు చేసే సాహసం చేస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఐసీసీ వారెంటును ఎదుర్కొంటున్న సుడాన్‌ మాజీ అధ్యక్షుడు ఒమర్‌ బషీర్‌.. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఐసీసీ సభ్య దేశాల్లో పర్యటించడం ఇక్కడ ప్రస్తావనార్హం.  

* రష్యాతోపాటు అమెరికా, చైనా, ఉక్రెయిన్‌ కూడా ఐసీసీ ఒప్పందంలో భాగస్వాములు కాకపోవడం గమనార్హం. ఇందులో చేరితే తమ బలగాలు, అధికారులకు విచారణ ముప్పు ఉంటుందని అమెరికా దీన్ని నిరాకరిస్తోంది. అయితే అమెరికా, ఉక్రెయిన్‌లు ఐసీసీకి సంబంధించిన కొన్ని కేసుల దర్యాప్తునకు సహకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు