ట్రంప్‌పై యంత్రాంగం అప్రమత్తత

తాను ఈ నెల 24న అరెస్టు కావడం అనివార్యమనీ, దానిపై ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని శ్రేణులకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన పిలుపుపై అమెరికా యంత్రాంగం అప్రమత్తమైంది.

Updated : 20 Mar 2023 06:03 IST

అటార్నీ కార్యాలయ భద్రతకూ చర్యలు
అరెస్టయితే ఉద్యమించాలని మాజీ అధ్యక్షుని పిలుపు

న్యూయార్క్‌: తాను ఈ నెల 24న అరెస్టు కావడం అనివార్యమనీ, దానిపై ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని శ్రేణులకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన పిలుపుపై అమెరికా యంత్రాంగం అప్రమత్తమైంది. అధ్యక్ష బాధ్యతల్ని జో బైడెన్‌ చేపట్టే సమయంలో 2021 జనవరి 6న కేపిటల్‌ భవంతి రణరంగంగా మారడానికి ట్రంప్‌ పిలుపు దారితీసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు మొదలయ్యాయి. అరెస్టుపై ప్రాసిక్యూటర్ల నుంచి ఎలాంటి వర్తమానం లేదని ట్రంప్‌ తరఫు న్యాయవాది చెబుతున్నారు. తాను అరెస్టైతే పెద్దఎత్తున నిరసనలు తెలిపేలా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా మాజీ అధ్యక్షుడు తాజా ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి వీలుగా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడిని విచారించడం అరుదు కావడంతో మన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ కార్యాలయంలోని 1,600 మంది సిబ్బంది భద్రతకు చర్యలు మొదలయ్యాయి. తాను లైంగిక సంబంధాలు నెరిపానని ఆరోపించిన మహిళలను డబ్బుతో ప్రలోభపెట్టడం, 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడం వంటి పలు అభియోగాలను మాజీ అధ్యక్షుడు ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు