భారత కాన్సులేట్‌పై దాడిని ఖండిస్తున్నాం.. ఘటనపై దర్యాప్తు చేపడతాం: అమెరికా

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థాన్‌ అనుకూలవాదులు దాడికి పాల్పడటాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది.

Updated : 22 Mar 2023 05:21 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత దౌత్య కార్యాలయంపై ఖలిస్థాన్‌ అనుకూలవాదులు దాడికి పాల్పడటాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆ విధ్వంస చర్య ఆమోదయోగ్యమైనది కాదని, శిక్షార్హమైన నేరమని ప్రకటించింది. దౌత్య కార్యాలయాలు, వాటిలో పనిచేసే దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. శ్వేత సౌధంలోని వ్యూహాత్మక కమ్యూనికేషన్ల జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బి సోమవారం రోజవారి న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో ఖలిస్థాన్‌ సానుభూతిపరుల దుశ్చర్యను తప్పుపట్టారు. సంఘటనపై విదేశాంగ విభాగం, స్థానిక అధికారులతో కలిసి దర్యాప్తు చేపడుతుందన్నారు. దౌత్య కార్యాలయంపై దాడిని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాక్‌ సులివాన్‌ ఖండించారు. ఆ చర్య భారత అమెరికన్లు, భారత ప్రజలను అవమానపరచడమేనన్నారు. దౌత్య కార్యాలయాలు, దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని, తదుపరి చర్యలు తీసుకోవడానికి విదేశాంగశాఖ..స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ ఎదుట నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నా స్థానిక పోలీసులు చేష్టలుడిగి చోద్యం చూశారంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో జాక్‌ పై మేరకు స్పందించారు. ఆ ఘటన సందర్భంగా దౌత్యకార్యాలయానికి నిప్పు పెట్టేందుకూ ఆందోళనకారులు యత్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు