World Health Organization: ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి

ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Updated : 05 Apr 2023 09:27 IST

17.15 శాతం మందిలో సమస్య
అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలి: డబ్ల్యూహెచ్‌వో

దిల్లీ: ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ప్రాంతాల మధ్య వంధ్యత్వ సమస్యలో పెద్దగా తేడాలు లేవని, సంపన్న, మధ్యతరగతి, పేద దేశాల్లో ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ‘సంపన్న దేశాల్లో 17.8 శాతం, మధ్య తరగతి, పేద దేశాల్లో 16.5శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉంది. సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అద్నాం గేబ్రియేసస్‌ తెలిపారు. ఇంతమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి సంతాన సాఫల్య సౌకర్యాలను విస్తరించాలని, అవి అందుబాటు ధరల్లో ఉండాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సమస్యను ఎలా గుర్తిస్తారు?

వరుసగా 12 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొన్న దంపతులకు పిల్లలు కలగకపోతే దానిని వంధ్యత్వ సమస్యగా గుర్తిస్తారు. 

ఐవీఎఫ్‌ అత్యంత ఖరీదు

వంధ్యత్వ నివారణ, నిర్ధారణ, ఐవీఎఫ్‌ తదితర చికిత్సా విధానాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు, పరిమితంగా చికిత్స అందుబాటులో ఉండటం ఇబ్బందిగా మారిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఐవీఎఫ్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్న కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని సంస్థ ప్రతినిధి పాస్కల్‌ అలాటీ పేర్కొన్నారు. అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ప్రజలు పేదరికంలోకి జారకుండా కాపాడవచ్చని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని