Cluster bombs: యుద్ధంలో ‘క్లస్టర్‌’ కలకలం!

ఉక్రెయిన్‌ నుంచి ఆయుధాల కోసం పెరుగుతున్న ఒత్తిడో...యుద్ధంలో రష్యాను కట్టడి చేయాలన్న కసో...దాదాపు 20 ఏళ్లుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన నిల్వలను వదిలించుకోవాలన్న ప్రణాళికో..కారణం ఏదైనా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధరంగంలో వివాదాస్పద ఆయుధాలను ప్రవేశపెట్టబోతోంది అమెరికా!

Updated : 08 Jul 2023 18:37 IST

ప్రపంచం నిషేధించిన బాంబులను... ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా నిర్ణయం!  
వాటితో మునుముందు భారీ నష్టం

ఉక్రెయిన్‌ నుంచి ఆయుధాల కోసం పెరుగుతున్న ఒత్తిడో...యుద్ధంలో రష్యాను కట్టడి చేయాలన్న కసో...దాదాపు 20 ఏళ్లుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన నిల్వలను వదిలించుకోవాలన్న ప్రణాళికో..కారణం ఏదైనా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధరంగంలో వివాదాస్పద ఆయుధాలను ప్రవేశపెట్టబోతోంది అమెరికా! అత్యంత ప్రమాదకరమైనవని 100కుపైగా ప్రపంచ దేశాలు నిషేధించిన క్లస్టర్‌ బాంబులను ఉక్రెయిన్‌ యుద్ధరంగంలోకి పంపాలని అమెరికా నిర్ణయించింది. దీనిపై మానవ హక్కుల సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏమిటీ క్లస్టర్‌ బాంబులు?

క్లస్టర్‌ ఆయుధాలనేవి గాల్లో విచ్చుకొని... ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒకే సమయంలో భిన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. అద్దం పగిలితే గాజు ముక్కలు భిన్నకోణాల్లో పడి గుచ్చుకున్నట్లుగా! ఫిరంగుల ద్వారా 24-32 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై వీటిని ప్రయోగించవచ్చు. మామూలు బాంబుల కంటే వీటి విధ్వంస ప్రభావం విస్తృతంగా ఉంటుంది. చిన్నచిన్న బాంబులుగా విచ్చుకుపోయి లక్ష్యాన్ని చేరే క్రమంలో పౌరనష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేగాకుండా...వీటిలోని మరో ప్రధాన సమస్య విచ్చుకుపోయిన బాంబుముక్కల్లో కొన్ని అప్పటికప్పుడు పేలవు. కొద్దికాలం తర్వాత పేలే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలే వీటిలో ఎక్కువ. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీటి ముప్పు ఉంటుంది. అందుకే... 2008లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 120కిపైగా దేశాలు ఈ క్లస్టర్‌ బాంబుల వాడకాన్ని నిషేధించాయి. వాటిలో నాటో దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు కూడా ఉన్నాయి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌లు మాత్రం ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. సిరియా ప్రభుత్వం తమ వ్యతిరేకవర్గాలపై వీటిని భారీస్థాయిలో ప్రయోగించింది. అఫ్ఘానిస్థాన్‌ యుద్ధంలో అమెరికా అదే పనిచేసింది. 2006 లెబనాన్‌ యుద్ధంలో ఇజ్రాయెల్‌ దాదాపు 40లక్షల క్లస్టర్‌ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. వాటిలో ఇప్పటికీ పేలుతూ లెబనాన్‌ ప్రజల ప్రాణాలు తీస్తున్నవి చాలా ఉన్నాయంటారు.

పేరుకు పోయినవాటిని...

అయినప్పటికీ 2009లో చేసిన ఓ చట్టం ఆధారంగా ఒకశాతం కంటే ఎక్కువ విఫలమయ్యే బాంబులను విదేశాలకు అమెరికా ఎగుమతి చేయటానికి వీల్లేదు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి దీన్ని అధిగమించే అవకాశం ఉంది. ఇప్పుడదే చేయబోతున్నారు. అమెరికా చివరిసారిగా వీటిని 2003లో ఇరాక్‌ యుద్ధంలో ఉపయోగించింది. తర్వాతి నుంచి వాటి వినియోగాన్ని ఆపేసింది. అప్పటి నుంచి అమెరికాలో భారీస్థాయిలో ఈ క్లస్టర్‌ ఆయుధాలు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 30 లక్షల దాకా  ఉన్నట్లు సమాచారం. వాటన్నింటినీ ఇప్పుడు ఉక్రెయిన్‌కు సరఫరా చేయటం ద్వారా అమెరికా వదిలించుకోబోతోంది.

రష్యాను నిలువరించాలంటే...

రష్యాపై ఎదురుదాడిని తీవ్రతరం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఈ క్లస్టర్‌బాంబులు ఇవ్వటమే సరైందని అమెరికా భావిస్తోంది. ‘రష్యా ఇప్పటికే క్లస్టర్‌ బాంబులను ఈ యుద్ధంలో ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎక్కువ నష్టం జరగటానికి అదే కారణం. రష్యాను నిలువరించాలంటే ఉక్రెయిన్‌కూ ఆ ఆయుధాలను ఇవ్వటంలో తప్పులేదు. పైగా ఇప్పుడు సరఫరా చేసే ఆయుధాల్లో విఫలమయ్యేవి చాలా తక్కువశాతం’ అని అమెరికా అధికారి ఒకరు సమర్థించుకున్నారు. కొత్తగా ఉక్రెయిన్‌ కోసం ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ ప్యాకేజీలో భాగంగా ఈ క్లస్టర్‌ బాంబులను సరఫరా చేయబోతున్నారని బైడెన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఈ బాంబులతో పౌర సమాజానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. విచక్షణారహితంగా దాడులతో చాలామంది మరణించే ప్రమాదం ఉంది. యుద్ధంలోనే కాదు...యుద్ధానంతరం పేలేవాటితోనూ నష్టమే’ అని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంజేస్తున్నాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు