Exercise: వ్యాయామం వారానికి 2 రోజులే అయినా మేలే!

వారానికి కేవలం రెండు రోజులు వ్యాయామం చేసినా గుండెపోటు, పక్షవాతం ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనమొకటి తేల్చింది.

Updated : 21 Jul 2023 08:03 IST

గుండెకు గణనీయ ప్రయోజనాలు చేకూరుతాయని నిర్ధారణ

దిల్లీ: వారానికి కేవలం రెండు రోజులు వ్యాయామం చేసినా గుండెపోటు, పక్షవాతం ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనమొకటి తేల్చింది. అయితే ఆ వ్యాయామ తీవ్రత సాధారణ స్థాయిలో కాకుండా కాస్త ఎక్కువగా ఉండాలని తెలిపింది. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ప్రతిఒక్కరికి వారానికి కనీసం 150 నిమిషాల ‘సాధారణం నుంచి తీవ్రస్థాయి శారీరక క్రియాశీలత (ఎంవీపీఏ)’ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా హార్ట్‌ అసోసియేషన్‌ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అయితే వారమంతటా సాధారణ స్థాయిలో వ్యాయామం కొనసాగించాలా? లేక తీవ్రస్థాయిలో కొన్నిరోజులే చేసి పూర్తిస్థాయి ప్రయోజనాలను పొందొచ్చా? అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ విషయాలను తేల్చేందుకు- బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. 2013-2015 మధ్య దాదాపు 90 వేలమంది (వీరి సగటు వయసు 62 ఏళ్లు) నుంచి ఆక్సెలరోమీటర్ల ద్వారా సేకరించిన డేటాను వారు తాజాగా విశ్లేషించారు. వారమంతటా సాధారణ స్థాయి వ్యాయామం చేసినా.. కేవలం 1-2 రోజులే తీవ్రస్థాయి వ్యాయామం చేసినా ఆరోగ్యంపై ప్రయోజనాలు దాదాపు సమాన స్థాయిలో ఉంటున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, ఏట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, మయోకార్డియల్‌ ఇన్‌ఫ్రాక్షన్‌ వంటి హృదయ సంబంధిత సమస్యల ముప్పు ఒకేలా తగ్గుతున్నట్లు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని