Israel - Palestine War: ఏమిటీ ద్విదేశ పరిష్కారం!

‘ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రజలు భద్రంగా, గౌరవ ప్రదంగా, శాంతియుతంగా జీవించే మార్గాన్ని మనమంతా వెతకాలి. నా మటుకైతే ద్విదేశ పరిష్కారమే ఈ సమస్యను ఓ కొలిక్కి తెస్తుంది.’

Updated : 20 Oct 2023 08:22 IST

ఇజ్రాయెల్‌, పాలస్తీనా సమస్యలో కీలకం

‘ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రజలు భద్రంగా, గౌరవ ప్రదంగా, శాంతియుతంగా జీవించే మార్గాన్ని మనమంతా వెతకాలి. నా మటుకైతే ద్విదేశ పరిష్కారమే ఈ సమస్యను ఓ కొలిక్కి తెస్తుంది.’

- హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటన ఇది. ఈ యుద్ధంలో తాము ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నామని చెబుతూనే దశాబ్దాలుగా రావణ కాష్టంలా కాలుతున్న ఈ సమస్యకు రెండు దేశాల ప్రతిపాదనే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ఇంతకూ ఏమిటీ రెండు దేశాల పరిష్కారం? ఎందుకని ఇది అమలుకు నోచుకోలేదు? ఇందులో ఉన్న సవాళ్లేంటి? ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా?

1947లో తొలిసారిగా..

రెండు దేశాల పరిష్కారమంటే.. ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల ఆవిర్భావం. 1947లో తొలిసారిగా ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పటికి బ్రిటిష్‌ పాలనలో ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి.. అరబ్బులకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ  తీర్మానించింది. అప్పటికి బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న భూభాగంలో 55శాతం ఇజ్రాయెల్‌కు, 45 శాతం పాలస్తీనాకు ఇవ్వాలని నిర్ణయించారు. యూదులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. పాలస్తీనా వాసులు ససేమిరా అన్నారు. దీంతో ఐరాస ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఇంతలో ఇజ్రాయెల్‌ యూదులు అధికంగా ఉండే ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. వెంటనే చుట్టూ ఉన్న ఇతర అరబ్‌ దేశాలతోపాటు పాలస్తీనీయులు ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్‌ నెగ్గి.. మరింత భూభాగాన్ని సొంతం చేసుకుంది. తర్వాత జరిగిన అరబ్‌ యుద్ధాల్లోనూ విజయం సాధించడంతో ఇజ్రాయెల్‌ భూభాగం పెరుగుతూ పోయింది. పాలస్తీనీయులు ఇజ్రాయెల్‌లో వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది. 1948కు ముందు బ్రిటన్‌ ఆధీనంలో ఉన్న దాదాపు 80శాతం భూభాగం ఇప్పుడు ఇజ్రాయెల్‌ చేతుల్లో ఉంది.

ఈజిప్టు ఒప్పందంతో రెండో అవకాశం

రెండు దేశాల ప్రతిపాదన 1978 ఇజ్రాయెల్‌, ఈజిప్టు ఒప్పందంతో రెండోసారి తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడి సమక్షంలో ఇజ్రాయెల్‌, ఈజిప్టు మధ్య ఒప్పందం కుదిరింది. దీన్ని క్యాంప్‌ డేవిడ్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం తర్వాతే ఇజ్రాయెల్‌, పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పీఎల్‌వో) మధ్య సయోధ్య కుదిరింది. 1993-95 మధ్య జరిగిన ఓస్లో ఒప్పందాల ఫలితంగా ఇజ్రాయెల్‌ను యూదు దేశంగా గుర్తించేందుకు యాసర్‌ అరాఫత్‌ నేతృత్వంలోని పీఎల్‌వో అంగీకరించింది. అదే సమయంలో పాలస్తీనా ప్రతినిధులుగా పీఎల్‌వోతో సంప్రదింపులకు, పాలస్తీనా స్వయం పాలన అథారిటీ ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. ఇరుపక్షాల మధ్య ఈ సానుకూల పరిణామాల ఫలితంగానే గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ పూర్తిగా వైదొలగి పీఎల్‌వోకు పాలనా బాధ్యతలను అప్పగించింది.

హమాస్‌ రాకతో మొదటికి..

ఇరుపక్షాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని అనుకుంటున్న తరుణంలో గాజాలో జరిగిన ఎన్నికల్లో పీఎల్‌వో స్థానంలో అతివాద హమాస్‌ సంస్థ గెలిచింది. గాజా పాలన చేపట్టిన హమాస్‌ ఇజ్రాయెల్‌ ఉనికిని తిరస్కరించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.


సవాళ్లు..

1947లో ఐరాస తొలుత ప్రతిపాదించినప్పుడు రెండు దేశాల ప్రతిపాదన అమలై ఉంటే ఎలా ఉండేదోగానీ.. రానురానూ మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో దీని అమలు సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం అనేక సవాళ్లున్నాయి. మొదటిది పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య సరిహద్దుల నిర్ణయం. పాలస్తీనీయులు ఎక్కువగా ఉండే వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లున్నాయి. భారీగా హద్దులను నిర్మించారు. వీటన్నింటితో పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఏర్పడితే ఇబ్బందులుంటాయి. 1949లో అప్పటి వైరి వర్గాల మధ్య ఓ సైనిక ఒప్పందం జరిగింది. జోర్డాన్‌, ఈజిప్టు, ఇజ్రాయెల్‌, సిరియాల హద్దులతో కూడిన ఓ సరిహద్దుకు గ్రీన్‌లైన్‌గా గుర్తించారు. ఇప్పుడు రెండు దేశాల ప్రతిపాదనకు ఆనాటి గ్రీన్‌లైనే ప్రాతిపదిక అవుతుందని అనుకుంటున్నారు. అంటే 1967కు ముందున్న సరిహద్దులకు అంగీకరించాల్సి ఉంటుంది.

రెండో సమస్య జెరూసలెం.. యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ జెరూసలెంను యూదులతోపాటు పాలస్తీనీయులూ తమ రాజధానిగా ప్రకటించుకుంటున్నారు. జెరూసలెంను విభజించడానికి ఎవరూ అంగీకరించడం లేదు. ఇక మూడో సమస్య.. పాలస్తీనా శరణార్థులు. చాలాకాలంగా సాగుతున్న సంఘర్షణవల్ల లక్షల మంది పాలస్తీనీయులు ఇళ్లు విడిచి శరణార్థులుగా వెళ్లారు. వారందరికీ తిరిగి ఆశ్రయం కల్పించడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించడం లేదు. వీరివల్ల ప్రాదేశిక సమతౌల్యం దెబ్బతినడమే కాకుండా తమ భద్రతకూ ప్రమాదముందని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. తాము వైదొలగిన గాజా ఇప్పటికే హమాస్‌ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ పదేపదే తమపై ఆ వైపు నుంచి దాడులు జరుగుతున్న సంగతిని గుర్తు చేస్తోంది.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని