స్ట్రైకర్‌.. శత్రు భయంకర్‌!

యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట శకటాల విషయంలో దశాబ్దాలుగా రష్యాపై ఆధారపడ్డ భారత్‌.. ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది.

Updated : 12 Nov 2023 05:59 IST

యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట శకటాల విషయంలో దశాబ్దాలుగా రష్యాపై ఆధారపడ్డ భారత్‌.. ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది. చైనాకు చెక్‌ పెట్టేందుకు అధునాతన ఆయుధాలను మోహరించాలన్న వ్యూహంలో భాగంగా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భూతల పోరులో కీలకమైన సాయుధ శకటాలను అగ్రరాజ్యంతో కలిసి ఉమ్మడిగా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.

భారత్‌, అమెరికాల విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రులతో శుక్రవారం జరిగిన ‘2+2 సంప్రదింపుల భేటీ’లో ఇది ప్రధానాంశమైంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే.. అధునాతన ‘స్ట్రైకర్‌’ సాయుధ శకటాలు మన ఆర్మీకి అందుతాయి. దీనివల్ల సైనికపరంగా భారత్‌కు ప్రయోజనం కలగడంతోపాటు దేశీయ ఆయుధ ఉత్పాదక రంగానికి ఊతం లభించనుంది. చైనాతోపాటు పాకిస్థాన్‌ సరిహద్దుల్లోనూ వీటిని మోహరించే అవకాశం ఉంది.


ఏమిటీ స్ట్రైకర్‌?

ఇది 8 చక్రాలతో నడిచే సాయుధ పోరాట శకటం. జనరల్‌ డైనమిక్స్‌ ల్యాండ్‌ సిస్టమ్స్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అమెరికా సైన్యం కోసం కెనడా, బ్రిటన్‌లోని కర్మాగారాల్లో ఇవి తయారవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా సైనికుడు స్టువార్ట్‌ ఎస్‌ స్ట్రైకర్‌, వియత్నాం పోరులో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రాబర్ట్‌ ఎఫ్‌ స్ట్రైకర్‌ల పేరును ఈ శకటానికి ఖరారు చేశారు. స్ట్రైకర్‌ శకటాలను అమెరికా.. ఉక్రెయిన్‌కు కానుకగా అందించింది. బ్రాడ్లీ శకటాలు, అబ్రామ్స్‌ ట్యాంకులతో కలిసి వీటిని కూడా రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్‌ సైన్యం ఉపయోగిస్తోంది.

శత్రు భూభాగంలోకి నిర్భయంగా..

దాడులను కాచుకుంటూ మన పదాతి దళ సైనికులను శత్రు భూభాగంలోకి, వారికి చేరువలోకి పంపడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఈ పనిని మెరుపు వేగంతో స్ట్రైకర్‌ నిర్వహించగలదు. ఈ క్రమంలో ప్రత్యర్థిపై విరుచుకుపడగలదు. ట్యాంకులు, ఇతర భారీ సాయుధ శకటాల కన్నా ఇది తేలికైంది. అందువల్ల ఎలాంటి భూభాగంలోనైనా ఒడుపుగా ప్రయాణించగలదు. ఈ లక్షణాల దృష్ట్యా ఇది శత్రుభీకర ఆయుధంగా తయారైంది. ఎలాంటి అవసరాలకైనా ఇది అద్భుతంగా సరిపోలుతుంది. దీని నిర్వహణకు పెద్దగా మౌలిక వసతులు అవసరంలేదు.

దుర్భేద్య కవచం

స్ట్రైకర్‌కు పటిష్ఠ కవచం ఉంది. అన్ని వైపుల నుంచీ ఇది రక్షణ కల్పిస్తుంది. ఎలాంటి రక్షణ లేని బహిరంగ ప్రదేశాల్లో ఇది శత్రుదాడుల నుంచి కాపాడుతుంది. పట్టణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఆకస్మిక దాడుల నుంచి రక్షిస్తుంది. 14.5 ఎంఎం తూటాలు, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడ్లు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. శత్రు బంకర్లు, గోడలను ధ్వంసం చేసుకొని ముందుకు వెళ్లగలదు. పెద్దగా శబ్దం చేయదు. ఈ వాహనానికి 4 వీల్‌ డ్రైవ్‌ వెసులుబాటు ఉంది. అవసరమైతే 8 వీల్‌ డ్రైవ్‌లోకి కూడా మారొచ్చు. బురదలో చిక్కుకుపోయినా సొంతంగా బయటకు వచ్చే సెల్ఫ్‌ రికవరీ సామర్థ్యం దీని సొంతం. భిన్న భూభాగాలకు అనుగుణంగా టైర్లలో పీడనాన్ని సర్దుబాటు చేయడానికి ‘కేంద్రీకృత టైర్‌ ఇన్‌ఫ్లేషన్‌’ వ్యవస్థ కూడా ఉంది.

మెరుగైన ఆయుధాలు

స్ట్రైకర్‌లో శక్తిమంతమైన ఆయుధాలను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి పాయింట్‌ 50 క్యాలిబర్‌ కలిగిన ఎం2 మెషీన్‌ గన్‌ లేదా ఎంకే19 40 ఎంఎం గ్రెనేడ్‌ లాంచర్‌ను అమర్చవచ్చు. అవి ప్రొటెక్టెడ్‌ రిమోట్‌ వెపన్‌ స్టేషన్‌లో ఉంటాయి. వాహనంపైకి రాకుండా లోపలి నుంచే వీటిని సైనికులు పేల్చవచ్చు. ఈ శకటానికి 30ఎంఎం శతఘ్నిని కూడా అమెరికా సైన్యం జోడించింది. లేజర్లను ప్రయోగించే డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధాలనూ మోహరించేందుకు కసరత్తు చేస్తోంది. సమీపంలోని యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 105 ఎంఎం మొబైల్‌ గన్‌నూ ఏర్పాటు చేస్తోంది. వీటివల్ల సైనిక కార్యకలాపాల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి వీలవుతుంది. ఈ సాయుధ వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చుకొని.. సింహభాగానికి ట్యాంకు విధ్వంసక క్షిపణి వ్యవస్థలను అమర్చాలని భారత్‌ భావిస్తోంది. మిగతా వాటిని యుద్ధంలో నిఘాకు, ఆదేశిక వ్యవస్థకు ఉపయోగిస్తారు.

భిన్న అవసరాలు తీర్చేలా.. 

స్ట్రైకర్‌లను యుద్ధరంగంలో భిన్న అవసరాలకు ఉపయోగించొచ్చు. పూర్తిస్థాయిలో సాయుధులైన 9 మంది పదాతి దళ సైనికులను కదనక్షేత్రంలోకి తరలించగలదు. క్షతగాత్రులను క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి, యుద్ధరంగంలో ఇంజినీరింగ్‌ సంబంధ తోడ్పాటు అందించడానికి ఉపయోగపడగలదు. కదనరంగంలో నిఘాకు, శత్రువులపై మోర్టార్‌, శతఘ్ని దాడులు చేయడానికి, ప్రత్యర్థులున్న ప్రదేశాన్ని నిర్దిష్టంగా పసిగట్టి, సరిగ్గా ఆ ప్రదేశంపైకి కాల్పులు జరిపేలా సైన్యానికి సాయపడుతుంది. అణు, జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మేరకు స్ట్రైకర్‌లో భిన్న వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.

  • ఇంజిన్‌: క్యాటర్‌పిల్లర్‌ సీ7, 350 హెచ్‌పీ
  • సిబ్బంది: ఇద్దరు
  • వేగం: గంటకు 100 కిలోమీటర్లు
  • పరిధి: 480 కిలోమీటర్లు
  • బరువు: 19 టన్నులు

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు