నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం

సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో ‘డీప్‌ఫేక్‌’ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు.

Updated : 28 Nov 2023 06:03 IST

ఈ ఏడాది అన్‌లైన్‌లో అత్యధికులు వెతికిన పదం ‘అథెంటిక్‌’

న్యూయార్క్‌: సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో ‘డీప్‌ఫేక్‌’ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 2023లో ప్రపంచం ఆన్‌లైన్‌లో వెతికిన పదాల్లో డీప్‌ఫేక్‌ ఒకటని మెరియం వెబ్‌స్టర్‌ నిఘంటు కంపెనీ వెల్లడించింది. ఒక వ్యక్తి ఫొటో, వీడియో, ఆడియోలను మార్చి, ఆ వ్యక్తి చేయని పనిని చేసినట్లుగా, పలకని మాటలను పలికినట్లుగా చూపడమే డీప్‌ఫేక్‌ అని నిఘంటు నిర్మాతలు నిర్వచించారు. అయితే 2023లో అత్యధికులు అన్వేషించిన పదం మాత్రం ‘అథెంటిక్‌’ అని మెరియం వెబ్‌స్టర్‌ నిఘంటు కంపెనీ సోమవారం ప్రకటించింది. దీనికి ‘నిజమైన, విశ్వసనీయమైన, ప్రామాణికమైన’ అని అర్థం. ప్రస్తుత కృత్రిమ మేధా జనిత డీప్‌ఫేక్‌ ప్రపంచంలో విశ్వసనీయత సంక్షోభంలో పడింది. అందుకే జనం తమ ఆన్‌లైన్‌ నిఘంటువులో నిజమైన వంటలు, నిజమైన స్వరం, నిజస్వరూపం కోసం వెతుకులాటను ముమ్మరం చేశారని నిఘంటు సంపాదకుడు పీటర్‌ సోకొలోవ్‌ స్కీ వివరించారు. ఈ సమాధాన పత్రాన్ని నిజంగా విద్యార్థే రాశాడా, రాజకీయ నాయకుడు నిజంగానే ఈ ప్రకటన చేశాడా అనే ప్రశ్నలు నేడు మార్మోగుతున్నాయనీ, కొన్నిసార్లు మన కళ్లను, మన చెవులను మనమే నమ్మలేకపోతున్నామని ఆయన గుర్తుచేశారు. మెరియం వెబ్‌స్టర్‌ ఆన్‌లైన్‌ నిఘంటువులో 5 లక్షల పదాలు ఉండగా, వాటిలో లవ్‌ అనే పదానికి అర్థం అన్వేషించేవారు ఎప్పుడూ అత్యధికంగా ఉంటారు. అది రివాజు కూడా. మరోవైపు.. ఈ సంవత్సరం అథెంటిక్‌ అనే పదం అగ్రాసనం అందుకొందని సోకొలోవ్‌ స్కీ చెప్పారు. 2023లో జనం చాలా ఎక్కువగా అన్వేషించిన పదాలలో రిజ్‌ (రొమాంటిక్‌ ఆకర్షణ, సమ్మోహన శక్తి), కబుట్స్‌ (ఇజ్రాయెలీ సాముదాయిక వ్యవసాయ క్షేత్రం, జనావాసం), ఇంప్లోడ్‌ (అంతఃస్పోటనం), కొరొనేషన్‌(పట్టాభిషేకం) వంటివీ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని