శ్వేతసౌధం, పెంటగాన్‌ ఫొటోలు తీసిన కిమ్‌ శాటిలైట్‌?

భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్‌ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.

Updated : 29 Nov 2023 06:13 IST

ప్యాంగ్యాంగ్‌: భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్‌ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. ఈ చిత్రాలను అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ వీక్షించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా సంస్థ తెలిపింది. నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం  గతంలో రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. ఈసారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. గత వారం ఈ ప్రయోగం జరగ్గా.. కిమ్‌ దీన్ని వీక్షించారు. ప్రయోగంలో పాలుపంచుకొన్న శాస్త్రవేత్తలు, సిబ్బందికి విందు ఇచ్చారు. ఈ నిఘా ఉపగ్రహం సోమవారం రాత్రి తీసిన అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు చిత్రాలను కిమ్‌ వీక్షించారని కథనం పేర్కొంది. అమెరికా నౌకాస్థావరం, విమాన వాహక నౌకలు, షిప్‌యార్డ్‌లు, వర్జీనియాలోని ఎయిర్‌ఫీల్డ్‌ చిత్రాలను ఉపగ్రహం తీసినట్లు తెలిపింది. అలాగే దక్షిణ కొరియాలోని సైనిక స్థావరాల చిత్రాలను సైతం తీసినట్లు ప్రకటించింది. అయితే, నిఘా ఉపగ్రహం ప్రయోగించిన వారంలోనే సరైన పనితీరును ప్రదర్శిస్తుందని చెప్పడం తొందరపాటే అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి అంతరిక్షం నుంచి ఫొటోలు తీసి పంపే సామర్థ్యం ఉందని అప్పుడే చెప్పలేమన్నారు. అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను గమనించడంతోపాటు అణ్వస్త్ర సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు చేస్తోందని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఇదివరకే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని