ఇక హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే

అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్‌-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు.

Published : 30 Nov 2023 05:25 IST

వాషింగ్టన్‌: అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్‌-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. ఇతర దేశాలకు వెళ్లి రెన్యువల్‌ కూడా చేసుకోనక్కర్లేదు. డిసెంబరు నుంచి అగ్రరాజ్యం ప్రారంభించనున్న పైలట్‌ ప్రోగ్రామ్‌ ప్రకారం.. అమెరికాలోనే పునరుద్ధరించుకోవచ్చు. ఇది అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుంది. అయితే అత్యధికంగా భారతీయులే ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20 వేల మందికి వీసాలను రెన్యువల్‌ చేయనున్నట్లు అమెరికా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ వెల్లడించారు. ‘‘భారత్‌లో అమెరికా వీసాలకు డిమాండ్‌ ఎక్కువ. భారతీయ ప్రయాణికులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో ఒకటి దేశీయ వీసా రెన్యువల్‌ ప్రోగ్రామ్‌. ప్రస్తుతానికి దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నాం. డిసెంబరు నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులు.. వారి స్వదేశాలకు వెళ్లకుండానే వీసాలను రెన్యువల్‌ చేసుకోవచ్చు. దీంతో భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు కూడా కొత్త దరఖాస్తులపై దృష్టిపెట్టొచ్చు. ఈ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20వేల మందికి వీసాలను ఇక్కడే పునరుద్ధరిస్తాం. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారు. క్రమంగా ఈ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తాం’’ అని జూలీ వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని, ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్న వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని