జపాన్‌ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం

అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్‌ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు.

Published : 30 Nov 2023 05:25 IST

 ఒకరి మృతి
ఏడుగురి గల్లంతు

 టోక్యో: అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్‌ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ఒకరు మృతి చెందారని.. మిగతా ఏడుగురి ఆచూకీ ఇంకా తెలియలేదని జపాన్‌ తీర రక్షణ దళం తెలిపింది. ప్రమాద కారణాలను వెల్లడించలేదు. మంటల్లో చిక్కుకున్న విమానం సముద్రంలో పడిపోవడాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో తీర రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. ప్రమాద ప్రాంతంలో ఒక వ్యక్తిని రక్షించి తీరానికి చేర్చాయి. తర్వాత అతను ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఓస్ప్రే అనేది అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేక విమానం. ఇది హెలికాప్టర్‌గా, విమానంగానూ పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్‌ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా రెండు కుప్పకూలాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని