ఎన్నికల ముందు షరీఫ్‌కు ఊరట

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ (73)ను ఏవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్‌ హైకోర్టు బుధవారం ప్రకటించింది.

Published : 30 Nov 2023 05:13 IST

 అవినీతి కేసులో నిర్దోషిగా ప్రకటించిన పాక్‌ హైకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ (73)ను ఏవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్‌ హైకోర్టు బుధవారం ప్రకటించింది. అక్రమ సంపాదనతో లండన్‌లో ఆస్తులు సమకూర్చుకొన్నట్లు ఆరోపణలున్న ఈ కేసులో 2018లో తనకు విధించిన పదేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ నవాజ్‌ షరీఫ్‌ పిటిషను దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా ఆయన బెయిలుపై ఉన్నారు. తాజాగా వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆమెర్‌ ఫరూఖ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నవాజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతకుముందు ఫ్లాగ్‌షిప్‌ అవినీతి కేసులో ఆయనను నిర్దోషిగా ట్రయల్‌ కోర్టు ప్రకటించడాన్ని వ్యతిరేకించిన అవినీతి నిరోధక సంస్థ ‘నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో’ ఆ తీర్పును సవాలు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో అప్పీలు చేసింది. తన అప్పీలును తాజాగా ఈ సంస్థ ఉపసంహరించుకొంది. సార్వత్రిక ఎన్నికల ముందు నవాజ్‌ షరీఫ్‌కు ఇది భారీ ఊరటగా చెప్పవచ్చు. తీర్పు అనంతరం నవాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భగవంతుడికి కృతజ్ఞతలు. నేను భారమంతా ఆయన మీదే వేశాను. నన్ను విజయుణ్ని చేశాడు’’ అని వ్యాఖ్యానించారు. అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై ఆయనను ప్రశ్నించగా.. ‘‘అది సహజన్యాయ సూత్రం. అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు