ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస

వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Published : 30 Nov 2023 05:14 IST

దిల్లీ: వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ జాతుల సమూహాల కదలికనే ఉష్ణమండలీకరణ అంటారు. ఇది సముద్రం స్వరూపాన్ని మార్చి, పర్యావరణ వ్యవస్థను, జీవవైవిధ్యాన్ని, ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో కొత్త జాతులు వచ్చి చేరడంతో సమశీతోష్ణ జాతులు జీవనం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయని ‘ట్రెండ్స్‌ ఇన్‌ ఎకలాజీ అండ్‌ ఎవల్యూషన్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది. కొన్నేళ్లుగా ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలాలను వేరుచేసే సముద్ర కదలికల్లో వచ్చిన మార్పులే జాతుల వ్యాప్తిని సులభతరం చేస్తున్నాయని తెలిపింది. దీంతో కొత్త జాతులు వచ్చి చేరుతున్నాయి ఉన్న జాతులు వేరే ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఈ తరహా మార్పులను మొదటగా మధ్యధరా సముద్రంలో గుర్తించారు. ఉష్ణమండల జాతులు పెరగడంతో ప్రస్తుతం ఈ సముద్రాన్ని ఉష్ణమండలీకరణకు కేంద్ర బిందువుగా పరిగణిస్తున్నారు. ఈ ఉష్ణమండలీకరణకు ప్రపంచ వైవిధ్యాన్ని మార్చగల సామర్థ్యం ఉందని బ్రిటన్‌ అధ్యయనకర్త కరొలినా ఝార్జిక్ని పేర్కొన్నారు. ఉష్ణమండలాల్లో నివసించే జాతుల గురించి చాలా అధ్యయనాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సముద్రంలో కొత్త జాతులు వచ్చినప్పుడు తలెత్తే దీర్ఘకాలిక పరిణామాలపై ప్రాథమిక అవగాహన కొరవడిందని మరో అధ్యయనకర్త సుజని విలియమ్స్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని