నవమాసాలు.. కృత్రిమ గర్భంలో..!

కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్‌; అండం, వీర్య దానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం (సరోగసీ), అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి.

Updated : 05 Dec 2023 07:49 IST

తల్లి శరీరానికి వెలుపల పిండం వృద్ధి
శాస్త్రవేత్తల ముందడుగు

లండన్‌: కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్‌; అండం, వీర్య దానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం (సరోగసీ), అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా సంతానోత్పత్తికి ఇప్పుడు అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇంత పురోగతి సాధించినా.. పునరుత్పత్తికి సంబంధించిన ఒక అంశంలో ఇప్పటికీ ఎలాంటి మార్పులేదు. అది.. పిండాన్ని గర్భంలోనే వృద్ధి చేయాల్సిన ఆవశ్యకత! ఆ ప్రక్రియలోనూ నూతన ఆవిష్కరణల దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. తల్లి శరీరానికి వెలుపల పిండాన్ని వృద్ధి చేసే అంశంలో కొన్ని విజయాలు సాధించారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సమాజంలో అనేక మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏమిటీ విధానం?

అండం, వీర్య కణ కలయికతో ఏర్పడే పిండం.. పూర్తిస్థాయి శిశువుగా వృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. ఇదంతా తల్లి గర్భశయంలోనే జరగాలి. దానికి భిన్నంగా శరీరానికి వెలుపల పిండం వృద్ధి చేయడాన్ని ఎక్టోజెనెసిస్‌ అంటారు. అది ఇప్పటివరకూ సైన్స్‌ కాల్పనిక సాహిత్యానికే పరిమితమైంది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ గర్భాశయాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఈ దిశగా జంతువులపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. గొర్రెల పిండాలను విజయవంతంగా ఈ పద్ధతితో వృద్ధి చేశారు.

మరోవైపు సిమ్యులేషన్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి నెదర్‌లాండ్స్‌లో ఇదే తరహా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, కంప్యూటర్‌ మోడలింగ్‌తో కూడిన మనిషి బొమ్మను ఉపయోగించి.. నెలలు నిండకుండా ఒక శిశువు జన్మించడాన్ని అనుకరించి చూస్తున్నారు. తద్వారా.. తల్లి గర్భాన్ని పోలిన వాతావరణంలో పిండం వృద్ధి చెందే తీరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల ప్రాణాలను రక్షించడానికి ఈ విధానాన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ పరిశోధనలు చేస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల తర్వాత ఇవి పూర్తిస్థాయి ఎక్టోజెనెసిస్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చని వారు  చెబుతున్నారు. తద్వారా.. పిండం ఏర్పడటం నుంచి శిశు జననం వరకూ.. ప్రక్రియ మొత్తం పూర్తిగా మానవ శరీరానికి వెలుపలే జరగడానికి మార్గం సుగమం కావొచ్చని పేర్కొంటున్నారు.


ప్రయోజనాలు..

  • కృత్రిమ గర్భం.. పునరుత్పత్తికి సంబంధించి ప్రజలు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మహిళలు తమ అండాలను నిల్వ చేసుకొని, భవిష్యత్‌లో మాతృత్వాన్ని పొందేందుకు వాటిని ఉపయోగించుకునే విధానం ఇప్పుడు అందుబాటులో ఉంది. అదేరీతిలో కృత్రిమ గర్భం కూడా.. సంతానోత్పత్తికి ఒక కొత్త సాధనంగా మారుతుంది.
  • ఏకకాలంలో బహుళ పిండాలను వృద్ధి చేసుకోవడానికీ ఈ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది. తద్వారా ఒకేసారి తాము అనుకున్న సంఖ్యలో సంతానాన్ని పొందడానికి జంటలకు వీలవుతుంది.
  • ఒంటరి పురుషులు, స్వలింగ సంపర్క జంటలు, అనారోగ్య కారణాల వల్ల గర్భాన్ని ధరించలేని మహిళలూ ఈ విధానంతో సంతానాన్ని పొందొచ్చు.
  • గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో ఎదురయ్యే అవకాశమున్న కొన్ని ఇబ్బందుల నుంచి మహిళలు విముక్తి పొందొచ్చు.

న్యాయపరమైన ఇబ్బందులు..

పూర్తిస్థాయిలో కృత్రిమ గర్భాన్ని సాకారం చేయడానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిచోట్ల పిండాలకు సంబంధించిన పరిశోధనలను పూర్తిగా నిషేధించారు. పరిశోధనల కోసం మానవ పిండాలను 14 రోజులకు మించి వృద్ధి చేయకూడదన్న నిబంధనలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. అందువల్ల ఎక్టోజెనెసిస్‌పై పరిశోధనలు పూర్తిస్థాయిలో సాగాలంటే శాసనపరమైన మార్పులు అవసరం. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. కృత్రిమ గర్భాలను ప్రజలు స్వాగతిస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ అంశంపై తలెత్తే నైతిక, సామాజిక సంబంధ ప్రశ్నలకూ సమాధానాలు లభించాల్సి ఉంది.
కృత్రిమ గర్భాలతో దీర్ఘకాల నిబంధనలు భారీగా మారిపోవచ్చు. ఇలాంటి విధానంలో.. కన్నతల్లి అనే భావన ఉండదు. అందువల్ల సంబంధిత శిశువుకు చట్టబద్ధ తల్లి ఎవరన్నదానిపై విస్పష్ట నిర్వచనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కృత్రిమ గర్భాల ఆలోచనను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం దీన్ని ప్రమాదకరమైన పోకడగా అభివర్ణిస్తున్నారు. సంప్రదాయ కుటుంబ నిర్మాణాలు, విలువలకు ముప్పుగా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని