యుద్ధాన్ని విస్తరించిన ఇజ్రాయెల్‌

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది.

Published : 05 Dec 2023 05:03 IST

సురక్షిత ప్రాంతాల కోసం పాలస్తీనీయుల పరుగు
భారీగా వైమానిక, భూతల దాడులు

డెయిర్‌ అల్‌-బలా: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్‌ యూనిస్‌ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనీయులను హెచ్చరించింది. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వచ్చిన వారంతా మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. ‘గాజా వ్యాప్తంగా హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా మా దాడులను విస్తరిస్తున్నాం. మా భూభాగంపై ఎవరు దాడి చేసినా.. వారిపై తీవ్రంగా ప్రతి దాడి చేస్తాం. అదే మా విధానం’ అని ఇజ్రాయెల్‌ సైనిక అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. ఆదివారం రాత్రి దాదాపు 200 హమాస్‌ లక్ష్యాలపై వైమానిక దళం బాంబులు వేసింది. ఐడీఎఫ్‌ దళాల భూతల ఆపరేషన్‌కు మద్దతుగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలోని బెయిట్‌ హనౌన్‌లో ఉన్న ఓ పాఠశాలలో హమాస్‌ స్థావరాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం గుర్తించింది. దీనినే ఇజ్రాయెల్‌ దళాలపై దాడులకు వాడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌ దాడుల్లో 15,890 మంది పాలస్తీనీయులు మరణించారు. 42,000 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 70శాతం మంది మహిళలు, పిల్లలే.

హమాస్‌ చెరలో బందీ హత్య

బందీగా ఉన్న యోనాథన్‌ సమరానో అనే యువకుడిని హమాస్‌ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్‌ దళాలు సమాచారం అందజేశాయి. అతడి మృతదేహం ఇప్పటికీ హమాస్‌ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నాయి. అక్టోబరు 7న నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ దాడి చేసిన సమయంలో అతడిని హమాస్‌ కిడ్నాప్‌ చేసింది. ఆ తర్వాత అతడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను ఒక ఇంట్లో బందీగా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం అతడితో సంబంధాలు తెగిపోయాయి. కొన్నాళ్లకు అతడితోపాటు ఉన్న మిత్రుల మృతదేహాలు బయటపడ్డాయి. అతడిని కూడా హమాస్‌ కాల్చేసినట్లు తర్వాత తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని