బ్రిటన్‌ ‘ఉపాధి వీసా’ కఠినతరం

Published : 05 Dec 2023 05:39 IST

వలసలను అడ్డుకునేందుకు బిల్లు

లండన్‌: విపరీతంగా పెరిగిపోతున్న వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచీ అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు బ్రిటన్‌ హోంశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ సోమవారం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బిల్లు పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వచ్చే వృత్తి నిపుణులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌ తీసుకురాలేరు. కఠిన నిబంధనలవల్ల ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకూ తగ్గుతారని మంత్రి క్లెవర్లీ తెలిపారు.

  • బ్రిటన్‌లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఆ వేతనం 38,700 పౌండ్లు ఉండాలి. గతంలో కుటుంబ వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. దానినీ 38,700 పౌండ్లకు ప్రభుత్వం సవరించింది.
  • భవిష్యత్తులో విద్యార్థి వీసాలపైనా ఆంక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి క్లెవర్లీ వెల్లడించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని