శిలాజ ఇంధనాలకు స్వస్తి చెబుదాం

ఐక్యరాజ్య సమితి కాప్‌-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది.

Published : 07 Dec 2023 05:47 IST

అధిక దేశాల ఆకాంక్ష
కాప్‌-28 సదస్సులో చర్చ

దుబాయ్‌: ఐక్యరాజ్య సమితి కాప్‌-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది. పేద దేశాలకు వాతావరణ మార్పులవల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 72 కోట్ల డాలర్లతో పరిహార నిధిని తొలి రోజు ఏర్పాటు చేశారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలను పరిహరించాలంటే మరెన్నో వందల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐరాస వాతావరణ కార్యదర్శి సైమన్‌ స్టియెల్‌ బుధవారం వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల నిరోధానికి కాప్‌-28 బుల్లెట్‌ రైలులా దూసుకుపోవాల్సి ఉండగా, పాతకాలపు పొగబండిలా తుప్పు పట్టిన పట్టాలపై ముక్కుతూ మూలుగుతూ కదలుతోందని పేర్కొన్నారు. భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలవద్ద స్థిరీకరించాలన్న పారిస్‌ తీర్మానం అమలులో ఎంతవరకు ప్రగతి సాధించామనేది దుబాయ్‌ సదస్సులో సమీక్షించబోతున్నారు. కానీ ఈ సమీక్షా పత్రం ముసాయిదాలో వాడాల్సిన పదజాలం మీద తర్జనభర్జన జరుగుతోంది. తమ డిమాండ్లు, అభ్యంతరాలను ఈ ముసాయిదా ఎంతవరకు పట్టించుకుంటుందో 197 దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. భూతాపానికి కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువులను పూర్తిగా వదిలించుకోవాల్సిన అవసరాన్ని మొట్టమొదటిసారి కాప్‌ ముసాయిదాలో చేర్చడం విశేషం. కానీ ఈ లక్ష్య సాధనకు గడువుపైనా, ముసాయిదాలో వాడే పదజాలంపైనా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. శిలాజ ఇంధనాలకు దశలవారీగా స్వస్తి చెప్పాలని 106 దేశాలు ఆశిస్తున్నాయి. కానీ ఈ ఇంధనాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలని ఆయిల్‌ ఛేంజ్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన పర్యావరణ వేత్త రొమైన్‌ లూలాలెన్‌ ఉద్ఘాటించారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా తగ్గించడానికి సౌదీ అరేబియా, ఇరాక్‌, తుర్కియేలు సుముఖంగా ఉన్నాయి.. తప్ప దశలవారీగా స్వస్తి చెప్పాలనే అంశం మీద వాటికి అభ్యంతరాలున్నాయి. భూతాపం పెరగడానికి రెండో పెద్ద కారణం.. రవాణా రంగం. కాబట్టి శిలాజ ఇంధనాలను విడనాడి విద్యుత్తు వాహనాలవైపు మళ్లాల్సిన ఆవశ్యకతపై కాప్‌-28 సదస్సు దృష్టి సారిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని