అవును.. కొవిడ్‌ సమయంలో సరిగా స్పందించలేదు

కొవిడ్‌ వైరస్‌ తీవ్రతను తమ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

Updated : 07 Dec 2023 06:16 IST

 వైరస్‌ తీవ్రతను తక్కువ అంచనా వేశాం
బాధితులకు క్షమాపణలు చెబుతున్నా
విచారణలో బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: కొవిడ్‌ వైరస్‌ తీవ్రతను తమ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన కొవిడ్‌ సమయం(2020)లో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బహిరంగ విచారణ జరుపుతున్న కమిటీ ముందు హాజరయ్యారు. చైనాలో వైరస్‌ ప్రారంభమవుతున్న దశలో తమ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని అంగీకరించారు. అయితే దీనికి తానొక్కడినే బాధ్యుడిని కాదని చెప్పారు. ఇది సామూహిక వైఫల్యమని, ఇందులో తన మంత్రులు, అధికారులు, శాస్త్ర సలహాదారుల బాధ్యత కూడా ఉందని అన్నారు. వైరస్‌ తీవ్రతపై వారు తగిన స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించలేదని పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలో వైరస్‌పై ఐదు సమావేశాలు జరిగాయని.. అందులో ఒక్కదానికీ తాను హాజరు కాలేదని వెల్లడించారు. ఆ సమావేశాల మినిట్స్‌ను మాత్రం ఒకట్రెండు సార్లు చూశానని తెలిపారు. కొవిడ్‌తో బ్రిటన్‌లో సుమారు 2,30,000 మంది చనిపోయారు. విచారణలో జాన్సన్‌.. కొవిడ్‌ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ఆ సమయంలో ఓ ఆందోళనకారుడు ‘‘మృతులు మీ క్షమాపణలు వినలేరు’’ అనే పోస్టర్‌ పట్టుకొని నిరసన తెలిపారు. వెంటనే ఆ వ్యక్తిని విచారణ గది నుంచి బయటకు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని