భారత హజ్‌, ఉమ్రా యాత్రికులకు వెసులుబాట్లు

భారత్‌ నుంచి హజ్‌, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సౌదీ అరేబియా పలు వెసులుబాట్లు కల్పించినట్లు సౌదీ అరేబియా హజ్‌, ఉమ్రా విభాగ మంత్రి తౌఫిగ్‌ అల్‌ రబియా తెలిపారు.

Published : 07 Dec 2023 05:54 IST

సౌదీ అరేబియా మంత్రి వెల్లడి

దిల్లీ: భారత్‌ నుంచి హజ్‌, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సౌదీ అరేబియా పలు వెసులుబాట్లు కల్పించినట్లు సౌదీ అరేబియా హజ్‌, ఉమ్రా విభాగ మంత్రి తౌఫిగ్‌ అల్‌ రబియా తెలిపారు. సత్వర వీసా పరిష్కారం, అదనపు విమానాలు, రవాణాపరమైన సౌలభ్యం వంటి వివిధ సదుపాయాలతో భారతీయుల మక్కాయాత్రను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న తౌఫిగ్‌ అల్‌ రబియా బుధవారం పీటీఐతో మాట్లాడారు. ప్రత్యేకంగా భారత యాత్రికులకు తమ ప్రయాణం అంతటా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా స్వతంత్ర ఉమ్రా పర్యటనలు చేసే మహిళలను దృష్టిలో పెట్టుకొని పలు కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఉమ్రా వీసాను 90 రోజులకు పొడిగించడం, పెరుగుతున్న భారత యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నాలుగు రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ వంటి చర్యలు తీసుకొన్నట్లు వివరించారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా, సురక్షిత ప్రయాణ వాతావరణం ఉండేలా ప్రయాణికులు అందరికీ సంతృప్తికరమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించడమే ఈ మార్పుల లక్ష్యమన్నారు. ‘తషీర్‌’ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం భారత ఉమ్రా యాత్రికులకు స్నేహపూర్వక వీసా సేవలను అందించడంలో ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. 2024 హజ్‌ సీజను కోసం భారతీయులకు 1,75,025 అంచనా కోటాను కేటాయించినట్లు వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌లతో అల్‌ రబియా చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని