దుబాయ్‌లో పుతిన్‌.. యూఏఈ, సౌదీ పాలకులతో భేటీ

ఉక్రెయిన్‌పై యుద్ధంతో బిజీబిజీగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చాన్నాళ్ల తర్వాత తొలిసారిగా పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌(యూఏఈ)ల్లో బుధవారం పర్యటించారు.

Published : 07 Dec 2023 05:54 IST

దుబాయ్‌: ఉక్రెయిన్‌పై యుద్ధంతో బిజీబిజీగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చాన్నాళ్ల తర్వాత తొలిసారిగా పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌(యూఏఈ)ల్లో బుధవారం పర్యటించారు. అమెరికా మిత్రదేశాలైన ఈ రెండు చమురు సంపన్న దేశాలతో సఖ్యతను పెంచుకోవడం పుతిన్‌ పర్యటన ప్రధాన లక్ష్యం. అబుదాబిలో అడుగుపెట్టిన పుతిన్‌కు యూఏఈ విదేశాంగమంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అబుదాబిలోని కసర్‌ అల్‌ వతన్‌లో యూఏఈ పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌తో పుతిన్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై పాల్పడిన యుద్ధ నేరాలకుగాను పుతిన్‌పై ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంటు జారీచేసింది. కానీ ఐసీసీ ఏర్పాటు ఒప్పందంపై సౌదీ అరేబియా, యూఏఈలు సంతకాలు చేయలేదు. అందువల్ల ఈ రెండుదేశాలు పుతిన్‌ను అరెస్టుచేసే అవకాశం లేదు. పుతిన్‌ ఒక రోజు పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌బిన్‌ సల్మాన్‌తోనూ భేటీ అయ్యారు. చమురు ఉత్పత్తులు, సరఫరాల గురించి చర్చించినట్లు సమాచారం. పుతిన్‌ గురువారం ఇరాన్‌కు చేరుకుని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సమావేశమవుతారు. ఇరాన్‌, రష్యాలపై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలపై చర్చిస్తారు. కాగా పుతిన్‌ పశ్చిమాసియా పర్యటనపై కాప్‌ సదస్సుకు హాజరైన ఉక్రెయిన్‌ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘యుద్ధ నేరస్థుడిని ప్రపంచం ఇలా గౌరవించడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఎందుకంటే నా దృష్టిలో మాత్రం ఆయన యుద్ధనేరస్థుడే. ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు అలాంటి వారిని ఆహ్వానించి అతిథిగా చూసుకోవడం నా అభిప్రాయంలో వంచనే’’ అని ఉక్రెయిన్‌ తరఫున సదస్సుకు హాజరైన మార్హర్యట బుదనోవా మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని