ఓజోన్‌ కాలుష్యం పెరిగినా అధిక దిగుబడులు

భూ ఉపరితలానికి దగ్గరగా ఓజోన్‌ కాలుష్యం పెరిగినా దాన్ని తట్టుకునే శక్తి కొన్ని రకాల పంటలకు ఉందని భారత్‌, అమెరికా, చైనాల్లో 20 ఏళ్లపాటు జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి.

Published : 07 Dec 2023 05:57 IST

దిల్లీ: భూ ఉపరితలానికి దగ్గరగా ఓజోన్‌ కాలుష్యం పెరిగినా దాన్ని తట్టుకునే శక్తి కొన్ని రకాల పంటలకు ఉందని భారత్‌, అమెరికా, చైనాల్లో 20 ఏళ్లపాటు జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి. దీనివల్ల వాతావరణ మార్పులను తట్టుకునే పంటలను పెంచి మానవులకు అధిక ఆహారం, ఇంధనం, పీచు పదార్థాలు అందించడం వీలుపడనుంది. వరి, గోధుమ వంటి సీ3 పంటల కన్నా మొక్కజొన్న, జొన్నల వంటి సీ4 పంటలు ఎక్కువ ఓజోన్‌ స్థాయులను తట్టుకోగలవు. వాతావరణం నుంచి పీల్చుకునే బొగ్గుపులుసు వాయువును కొన్ని రకాల మొక్కలు 3-కర్బన కాంపౌండ్‌గా, మరికొన్ని 4-కర్బన కాంపౌండ్‌గా మార్చుకుంటాయి. కిరణజన్యసంయోగ క్రియ ద్వారా బొగ్గుపులుసు వాయువును గ్లూకోజ్‌గా మార్చే ప్రక్రియ సీ3, సీ4 పంటల్లో భిన్నంగా ఉంటుంది. ఈ ప్రక్రియకు రుబిస్కో అనే ఎంజైమ్‌ను ఉపయోగించినా, మొక్కజొన్న వంటి సీ4 మొక్కలు బొగ్గుపులుసు వాయువు పాళ్లు ఎక్కువగా ఉండే ప్రత్యేక కణాల్లోకి రుబిస్కోను చేరుస్తాయి. ఫలితంగా సీ3 పంటలకన్నా సీ4 పంటలు ఎక్కువ శక్తిమంతమైన కిరణజన్యసంయోగ క్రియను సాధిస్తాయి. నీటిని మరింత సమర్థంగా ఉపయోగించుకుంటాయి. వాతావరణంలో ఓజోన్‌ పాళ్లు పెరిగినప్పుడు విత్తన దిగుబడి, క్లోరోఫిల్‌ శాతం తగ్గిపోవడమనేది వరి, గోధుమ వంటి సీ3 పంటల్లో ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని