ఖాన్‌ యూనిస్‌లో హోరాహోరీ

గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌.. ఇప్పుడు హమాస్‌ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్‌లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌పై విరుచుకుపడుతోంది.

Published : 08 Dec 2023 05:42 IST

హమాస్‌ అధిపతి యాహ్య సిన్వర్‌కు చేరువలో ఇజ్రాయెల్‌ దళాలు
రేపో మాపో పట్టుకుంటాం: ఐడీఎఫ్‌

రఫా: గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌.. ఇప్పుడు హమాస్‌ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్‌లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌పై విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా పౌరులను హెచ్చరిస్తూ ఖాన్‌ యూనిస్‌లోని హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌కు చేరువవుతోంది. సిన్వర్‌ నివాసాన్ని ఐడీఎఫ్‌ బలగాలు చుట్టుముట్టాయని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే తాము ముట్టడించిన ప్రాంతంలో హమాస్‌ అధినేత లేరని ఐడీఎఫ్‌ తెలిపింది. అంగరక్షకులతో కలిసి ఆయన సొరంగాల్లో దాక్కున్నట్లు అనుమానిస్తోంది. 61 ఏళ్ల సిన్వర్‌ ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలోనే జన్మించారు. ఇస్లామిక్‌ కార్యకలాపాలు చేపడుతున్నందుకు తొలిసారి ఆయన 19 ఏళ్ల వయసులో అరెస్టయ్యారు. 1985లో మరోసారి అరెస్టయ్యారు. ఆ సమయంలోనే హమాస్‌ వ్యవస్థాపకుడు షేక్‌ అహ్మద్‌ యాసిన్‌ విశ్వాసం చూరగొన్నారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదిగిన సిన్వర్‌ 2017 నుంచి గాజా అధిపతిగా కొనసాగుతున్నారు. 2015లో అమెరికా కూడా సిన్వర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

5 వేల మందిని హతమార్చాం

గాజాపై దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 5 వేల మంది హమాస్‌ ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం దగ్గర భీకర పోరు సాగుతోంది. ఈ దాడి సందర్భంగా భారీ స్థాయిలో హమాస్‌ ఉగ్రవాదులు లొంగిపోయారని ఐడీఎఫ్‌ పేర్కొంది. మరోవైపు ప్రస్తుత పోరు కారణంగా 18 లక్షల 70 వేల మంది గాజా వాసులు తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని ఐరాస పేర్కొంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 17 వేల 177 మంది మృతిచెందారని, 42 వేల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

గాజాపై ఇజ్రాయెల్‌ విచక్షణారహితంగా చేస్తున్న దాడులను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సమాజంలో ఓ సభ్యురాలిగా భారత్‌ తన వంతు కర్తవ్యాన్ని పోషించాలని డిమాండ్‌ చేశారు.


భారత సంతతి ఇజ్రాయెలీ సైనికుడి మృతి

హమాస్‌తో గాజాలో జరుగుతున్న పోరులో భారత సంతతి ఇజ్రాయెలీ సైనికుడు గిల్‌ డానియెల్స్‌ (34) మృతి చెందారు. హీబ్రూ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీలో మాస్టర్స్‌ చేసిన గిల్‌..యుద్ధం ప్రారంభం కాగానే ఇజ్రాయెలీ రిజర్వు సైన్యంలో చేరారు. గిల్‌తో పాటు.. మరో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. మహారాష్ట్ర మూలాలు కలిగిన గిల్‌ నిశ్చితార్థం నెల రోజుల క్రితం జరిగింది. గాజాపై భూతల దాడులు ప్రారంభించిన తర్వాత దాదాపు 88 మంది సైనికులను ఇజ్రాయెల్‌ కోల్పోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని