అమెరికాలో కాల్పులకు పాల్పడిన ప్రొఫెసర్‌

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్‌ వేగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.

Published : 08 Dec 2023 05:41 IST

ముగ్గురి మృతి..
పోలీసు కాల్పుల్లో నిందితుడి హతం

లాస్‌ వెగాస్‌ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్‌ వేగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు పరుగులు తీసి సమీప గదుల్లో దాక్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నా స్థిరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వర్సిటీలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆగంతుకుడు మృతి చెందాడని, అతడు ఓ ప్రొఫెసర్‌ అని పోలీసులు తెలిపారు.

నిందితుడు ఇటీవలే నెవెడా వర్సిటీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని, అయితే జాబ్‌ పొందలేకపోయాడని దర్యాప్తు బృందం గుర్తించింది. గతంలో అతడు నార్త్‌ కరోలినాలోని ఈస్ట్‌ కరోలినా యూనివర్సిటీలో పనిచేసినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం యూనివర్సిటీలో మాత్రమే కాకుండా నగరంలో మరో చోట కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విశ్వవిద్యాలయంతో పాటు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసి వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని